
అందుబాటులోకి వచ్చిన ‘ఆదివాణి’ యాప్
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో తొలిసారిగా గిరిజన భాషల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత అనువాద యాప్‌ను ప్రభుత్వం ఆవిష్కరించింది. ‘ఆది వాణి’పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ద్వారా హిందీ, ఇంగ్లిష్ భాషలతో పాటు సంతాలి, భీళీ, ముండారి, గోండి వంటి గిరిజన భాషలను పరస్పరం అనువదించుకునే సౌకర్యం లభించనుంది. గిరిజన, గిరిజనేతర సమాజాల మధ్య భాషా అంతరాలను తగ్గించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం.
ఐఐఐటీ హైదరాబాద్ కీలక పాత్ర...
ఐఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఢిల్లీ, బిట్స్ పిలానీ, ఐఐఐటీ నవ రాయపూర్ వంటి విద్యాసంస్థలు ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి. ఇందులో భాగంగా ఐఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం అనువాద వ్యవస్థలు, టెక్సŠట్–టు–స్పీచ్ టూల్స్ రూపొందించింది. గిరిజన భాషల నిపుణులు, స్థానికులతో కలిసి పనిచేయడం వల్ల సరిగ్గా అనువాదం సాధ్యమైందని ఆ సంస్థ ప్రొఫెసర్ రాధిక మామిడి తెలిపారు. ఇది కేవలం టెక్నాలజీ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఒక సామాజిక మిషన్’అని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ‘ఆది వాణి’యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో, ప్రత్యేక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ యాప్ ద్వారా మరిన్ని గిరిజన భాషలను జోడించాలన్నది బృందం ప్రణాళిక. ముఖ్యంగా కోయ, కొలామీ, చెంచు, లంబాడీ వంటి భాషలకు కూడా ఏఐ ఆధారిత టూల్స్‌ను అభివృద్ధి చేయాలని ఐఐఐటీ హైదరాబాద్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు.
‘ఇథనాల్ బ్లెండింగ్’ కుటుంబ పథకమైంది
కేంద్ర మంత్రి గడ్కరీపై కాంగ్రెస్ ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల్లో ఇథనాల్‌ను తప్పనిసరిగా కలిపే విధానాన్ని తన కుటుంబానికి మేలు చేసే లాభసాటి పథకంగా మార్చారని కాంగ్రెస్ ఆరోపించింది. పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే గడ్కరీ కుమారుల కంపెనీలు మాత్రం లాభాలు గడించాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖెడా ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మోదీజీ ఓటు చోరీతో వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పెట్రోల్ చోరీ, కల్తీలతో అధికారాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు.
గడ్కరీ కొడుకు నిఖిల్ యాజమాన్యంలో ఉన్న సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ను ఆయన ఉదహరించారు. కంపెనీ ఆదాయం జూన్ 2024లో రూ.18 కోట్లు ఉండగా.. జూన్ 2025 నాటికి రూ.523 కోట్లకు పెరిగిందన్నారు. మరో కొడుకు సారంగ్ మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఉన్నారని, ఆయనా ఇథనాల్ ఉత్పత్తిలోనూ పాలుపంచుకున్నారని ఆరోపించారు. ఇథనాల్–మిశ్రమ ఇంధనం గురించి 2018లో ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందని బీజేపీ చెప్పినా.. తగ్గకపోగా ధరలు పెరిగాయన్నారు. ఏడేళ్లుగా ఇదే జరుగుతున్నా ఒక్క పైసా కూడా సామాన్యుడికి ఎందుకు చేరలేదని ప్రశ్నించారు.