హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా భారీ కూల్చివేతలు.. ఈసారి ఎక్కడంటే? | Hydra Demolitions in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా భారీ కూల్చివేతలు.. ఈసారి ఎక్కడంటే?

Feb 9 2025 5:17 PM | Updated on Feb 9 2025 5:29 PM

Hydra Demolitions in Hyderabad

సాక్షి,హైదరాబాద్‌ : హైడ్రా దూకుడు పెంచింది.తమ ప్లాట్లలో ఫామ్‌హౌస్‌ కట్టారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వందల మంది బాధితులు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను ఆశ్రయించారు. దీంతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ బాధితుల సమస్యల్ని విన్నారు. బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించేస్తున్నారు.

తాజాగా, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. కోహెడ సర్వే నెంబర్‌ 951, 952లో 7.28 గుంటల భూమిని రియల్టర్‌ సంరెడ్డి బాల్‌రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసిన ప్లాట్లలో ఫాం హౌస్‌ నిర్మించాడు. దీంతో 170 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య కూల్చి వేతలకు ఉపక్రమించింది.

రంగనాథ్‌ వార్నింగ్‌
మొన్నటికి మొన్న శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్‌లను తొలగించింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్‌ నగర్‌, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.

సంపత్‌ నగర్‌లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్‌ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా  హెచ్చరికలు జారీ చేసింది.

ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement