4 గంటల్లో విజయవాడకు’ అంటూ.. ఒక్కొక్కరి నుంచి రూ.600–800 వరకు వసూలు

Hyderabad: RTC Losing Revenue Due To LB Nagar To Vijayawada Car Services - Sakshi

ప్రయాణికులను లాగేసుకుంటున్న వందలాది కార్లు

విజయవాడకు నిత్యం 700 వరకు కార్ల పరుగు..

ఈ మార్గంలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ 55 శాతమే

హయత్‌నగర్‌కు చెందిన రామకృష్ణ విజయవాడలో ఓ శుభకార్యానికి అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది. ఎల్బీనగర్‌లో బస్సులు నిలిపే చోటుకి వెళ్లాడు. ‘ఆర్టీసీ బస్సులో వెళ్తే 6 గంటలు పడుతుంది. కారులో 4 గంటలే.. రండి’ అని పిలుపు వినపడటంతో అటు చూశాడు. వరుసగా 10 వరకు కార్లు ఆగి ఉన్నాయి. వాటి డ్రైవర్లూ ఇలాగే అరుస్తున్నారు. వెంటనే వెళ్లి ఓ ఇన్నోవాలో కూర్చున్నాడు. తిరుగు ప్రయాణంలోనూ ఇన్నోవాలోనే వచ్చాడు.

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌–విజయవాడ మధ్య ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 700 కార్లు షటిల్‌ సర్వీసుల్లా తిరుగుతున్నాయి. ఆర్టీసీకి సమాంతరంగా మరో రవాణా వ్యవస్థనే నిర్వహిస్తున్నాయి. ‘తక్కువ సమయంలో గమ్యం’ పేరుతో ప్రయాణికులను లాగేసుకుంటున్నాయి. దీంతో పెద్దమొత్తంలో ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోతోంది. ప్రైవేటు ట్రావెల్స్‌ స్టేజీ క్యారియర్ల అవతారమెత్తటంతో సాలీనా రూ.2వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్టు ఆర్టీసీ గతంలోనే తేల్చింది. ఇప్పుడు ఆ బస్సులకు తోడు కార్లూ ఆర్టీసీకి ప్రమాదకరంగా మారాయి.నిత్యం దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌ స్టేజీల వద్ద బస్సులు ఆగే బస్‌బేలలోనే నిలిపి దర్జాగా ప్రయాణికులను కార్లు తన్నుకుపోతున్నాయి. 

ట్రాఫిక్‌తో ప్రయాణ సమయం పెరిగి..
విజయవాడ హైవే విస్తరించాక ప్రయాణ సమయం గంటన్నర మేర తగ్గింది. కానీ కొంతకాలంగా కార్లు, ఈ రోడ్డు మీదుగా వెళ్లే ఇతర వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. రెండేళ్లలో ఈ వాహనాల సంఖ్య మరీ పెరిగి ఇప్పుడు బస్సు విజయవాడ చేరేందుకు 6 గంటలకుపైగా పడుతోంది. దీంతో జనం కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికులను కార్లు మళ్లించుకుపోతున్నా ఆర్టీసీ మాత్రం పట్టించుకోవట్లేదు. గత దసరా రోజు తాత్కాలికంగా సిబ్బందిని ఏర్పాటు చేసి రవాణా శాఖ ఆధ్వర్యంలో 55 కేసులు నమోదు చేయించి చేతులు దులిపేసుకుంది. 
చదవండి: నుమాయిష్‌పై కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఈ ఏడాది పూర్తిగా రద్దు..

నిత్యం 214 సర్వీసులు తిరగాల్సి ఉన్నా..
విజయవాడ వైపు నిత్యం 214 తెలంగాణ సర్వీ సులు తిరగాలి. వీటిల్లో 115 నాన్‌ ఏసీ బస్సులు, మిగతావి రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ సర్వీసులుండాలి. కానీ 20 సర్వీసులకు డీజిల్‌ ఖర్చుకు సరిపడా డబ్బులు కూడా రావట్లేదు. ఇలాంటి వాటిని విజయవాడకు కాకుండా రాష్ట్రంలోనే అంతర్గతంగా తిప్పుతున్నారు. ప్రస్తుతం సగటున 160 సర్వీసులే రోజూ విజయవాడ తిరుగుతున్నాయి. వీటి సగటు ఆక్యుపెన్సీరేషియో 55% మాత్రమే. విజయవాడ–హైదరాబాద్‌ మధ్య ఏపీ బస్సులు 225 వరకు తిరుగుతున్నాయి. మరో 230 ప్రైవేటు బస్సులున్నాయి. వీటికి తోడు ఇప్పుడు వందల సంఖ్యలో కార్లు తిరుగుతుండటంతో నష్టాలు పెరుగుతున్నాయి. ట్యాక్సీ ప్లేట్‌ లేని కార్లు కూడా షటిల్‌ సర్వీసుల్లో ఉంటున్నాయి.

కో ఆర్డినేట్‌ చేస్తూ.. కార్లు ఎక్కిస్తూ..
కార్లను కో ఆర్డినేట్‌ చేసేందుకు కొందరు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఓ డ్రైవరు తనకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటే మరో కారుకు వారిని సమన్వయంతో పంపిస్తున్నారు. కారు డ్రైవరు తిరుగుప్రయాణానికి కూడా ప్రయాణికులకు విజయవాడ నుంచి మరో కారులో సీట్‌ బుక్‌ చేస్తున్నారు. ఇందుకు కమీషన్‌ తీసుకుంటున్నాడు. ఇంత పక్కాగా నడుస్తున్నా ఆర్టీసీ కళ్లు తెరవటం లేదు. 
చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. వనమా రాఘవ అరెస్ట్‌

ఓలా, ఉబర్‌ల నుంచి వైదొలిగి..
ఇంతకుముందు హైదరాబాద్‌లో ఓలా, ఉబర్‌ లాంటి సంస్థల్లో దాదాపు 70 వేలకుపైగా కార్లు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య సగానికి పడిపోయింది. డీజిల్‌ భారంతో మిగులు అంతగా లేదని వాటి నుంచి వైదొలిగి డ్రైవర్లు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అలా కొందరు షటిల్‌ సర్వీసులపై దృష్టి సారించారు. ఒక్కో కారులో ఐదారుగురిని తరలిస్తున్నారు. విజయవాడకు ఒక్కొక్కరికి రూ.600 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. నిత్యం గిరాకీ ఉంటుండటంతో ఆదాయంపై కచ్చితమైన భరోసా ఉంటోంది. దీంతో ఒకరిని చూసి మరొకరు ఇటు మళ్లుతున్నారు. అలా దాదాపు 2 వేల క్యాబ్‌లు షటిల్‌ సర్వీసుల్లోకి వచ్చినట్టు అంచనా.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top