TSRTC: స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువు

Hyderabad: Poor Response to Voluntary Retirement in TSRTC - Sakshi

పథకంలో ఉన్న సందేహాలే కారణం

ఇప్పటి వరకు సుమారు 300 మంది దరఖాస్తు

ఉద్యోగుల ప్రయోజనాలపై స్పష్టత లేకనే వెనుకంజ

గ్రేటర్‌లో సుమారు 7 వేల మంది వీఆర్‌ఎస్‌కు అర్హులు

వయోభారం దృష్ట్యా డ్రైవర్లు, మహిళా కండక్టర్లు వీఆర్‌ఎస్‌కు మొగ్గు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువైంది. చాలా కాలంగా వీఆర్‌ఎస్‌ కోసంఎదురు చూస్తున్న వేలాది మంది కార్మికులు సైతం సందిగ్ధంలో పడ్డారు. వీఆర్‌ఎస్‌ పథకంలో స్పష్టత లేకపోవడం, కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలపై విధివిధానాల్లో స్పష్టత లోపించడం వల్ల వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వయోభారం దృష్ట్యా ఉద్యోగ విరమణ చేయాలని భావిస్తున్నప్పటికీ  పదవీ విరమణ ప్రయోజనాల్లో నష్టం వాటిల్లవచ్చుననే ఆందోళన వల్ల కార్మికులు ఈ పథకానికి దూరంగా ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

గ్రేటర్లోని 29 డిపోల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 300 మంది ఉద్యోగులు మాత్రమే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ పథకానికి అర్హులైన వారు సుమారు 7000 మంది ఉన్నారు. ఈ ఏడాది కనీసం 2000 మంది  వీఆర్‌ఎస్‌ తీసుకోవచ్చునని అధికారులు అంచనా వేశారు. కానీ అనేక రకాల అనుమానాల దృష్ట్యా చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు.  


ప్రయోజనాలపై స్పష్టత లేదు... 

‘వీఆర్‌ఎస్‌ తీసుకొని ఉన్నపళంగా రోడ్డున పడుతామేమో అనిపిస్తోంది. ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు’ అని రాణిగంజ్‌ డిపోకు చెందిన సీనియర్‌ డ్రైవర్‌ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. వీఆర్‌ఎస్‌ కోసం రెండేళ్లుగా ఎదురుచూశామని, చివరకు దాంట్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియకపోవడం వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు పలువురు సీనియర్‌ మహిళా కండక్టర్‌లు అభిప్రాయపడ్డారు. కనీసం 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు లేదా 55 ఏళ్ల వయసు నిండిన వాళ్లు దీనికి అర్హులు. 
    
కానీ 2013 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వీఆర్‌ఎస్‌ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 పీఆర్‌సీలు పెండింగ్‌ జాబితాలో ఉన్నాయి. వీటి కోసంఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే మరో 6 డీఏలు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు వీఆర్‌ఎస్‌ తీసుకొంటే అటు పీఆర్సీకి నోచక, ఇటు డీఏలు దక్కక తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ‘ఉద్యోగ విరమణ అనంతరం వైద్య సదుపాయం ఉంటుందో లేదో కూడా స్పష్టత లేదు. 20 ఏళ్లు పూర్తి చేసిన వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్‌ ఇవ్వకుండా సాగనంపుతున్నట్లుగానే ఉంది’ అని బండ్లగూడ డిపోకు చెందిన సీనియర్‌ ఉద్యోగి ఒకరు చెప్పారు.   


వయోభారంతో ఎదురు చూపులు..

► ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం ఉద్యోగ విరమణ చేయవలసిన వాళ్లు  2021 వరకు విధులు నిర్వహించారు. కానీ చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్‌లు, మహిళా కండక్టర్‌లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవాళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. (క్లిక్‌: బాసర ట్రిపుల్‌ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్‌ వాస్తవాలు!)


► గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 29 డిపోలు, కార్యాలయాల్లో సుమారు 18 వేల మందికి పైగా పని చేస్తున్నారు. వీరిలో 55 ఏళ్లు నిండిన వాళ్లు లేదా, 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లు కనీసం7 వేల మంది ఉన్నట్లు అంచనా. (క్లిక్‌: ప్రైవేటు డిస్కంలకు లైన్‌ క్లియర్‌!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top