ప్రభుత్వ విద్యుత్‌ కంపెనీల గుత్తాధిపత్యానికి తెర!

line clear for private discoms - Sakshi

శుక్రవారం బయటికొచ్చిన విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా బిల్లు

ఒకేచోట ఎక్కువ డిస్కంలకు చాన్స్‌.. ప్రైవేటుకూ తలుపులు బార్లా

ప్రజలకు నేరుగా విద్యుత్‌ విక్రయించనున్న ప్రైవేటు కంపెనీలు 

తక్కువ ధరకు విద్యుత్‌ ఇచ్చే కంపెనీని వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చు

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ రంగంలో ప్రభుత్వ విద్యుత్‌ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరవేస్తూ.. ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం నూతన సంస్కరణలతో తెస్తున్న విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ముసాయిదా శుక్రవారం బహిర్గతమైంది. దీనిని ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోని కీలక అంశాలు..

ఎక్కడైనా ఒకే ప్రాంతం పరిధిలో విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఎక్కువ డిస్కంలకు అనుమతులు ఇవ్వనున్నారు. సొంత ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ (విద్యుత్‌ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు) ఉన్న కంపెనీలకే లైసెన్స్‌ అన్న నిబంధనను తొలగిస్తున్నారు. దీనితో ప్రైవేటు కంపెనీలూ తెరపైకి రానున్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా లైసెన్స్‌ జారీ చేసేలా కేంద్ర నిబంధనలు ఉన్నాయి.

ప్రస్తుత విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ల ద్వారా వచ్చే విద్యుత్‌ను, అందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రాల ఈఆర్సీలు.. భవిష్యత్తులో వచ్చే అన్ని  కంపెనీలకు సమానంగా పంచాల్సి ఉంటుంది. అదనపు విద్యుత్‌ అవసరమైన కంపెనీలు కొత్తగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను చేసుకోవాల్సి ఉంటుంది.

రిటైల్‌ విద్యుత్‌కు సంబంధించి గరిష్ట, కనిష్ట ధరలను మాత్రమే రాష్ట్రాల ఈఆర్సీలు నిర్ణయిస్తాయి. అంటే ఈ గరిష్ట, కనిష్ట ధరల మధ్య ఎవరు తక్కువ చార్జీలను ఆఫర్‌ చేస్తే ఆ కంపెనీని ఎంపిక చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది. సంస్థల మధ్య పోటీ వల్ల నాణ్యమైన సరఫరా ఉంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.ప్రైవేటు డిస్కంల రాకతో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్థితి ఉంటుందన్న ఆందోళన కనిపిస్తోంది.

ప్రస్తుతం విద్యుత్‌ రంగం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉంది. ఇప్పుడీ సవరణలు అమల్లోకి వస్తే.. విద్యుత్‌ రంగం పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి వెళుతుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది.

చదవండి: మూడురోజులు అతిభారీ వర్షాలు! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top