
రాజధానిలో ఉల్లంఘనులకు విధిస్తున్న జరిమానా
వాహనచోదకులకు సరాసరిన 42,293 ఈ–చలాన్లు
తిరిగి చెల్లిస్తున్నవారు మాత్రం కేవలం 30 శాతమే..
పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.325.7 కోట్లు
స్పష్టం చేస్తున్న జనవరి–అక్టోబర్ 6 మధ్య గణాంకాలు
రోడ్డు మీద కాస్త ముందుకు వెళ్లి వాహనాన్ని ‘యూ టర్న్’తీసుకోవాలంటే నిర్లక్ష్యం.. రెడ్‌సిగ్నల్ పడినప్పుడు ఆగాలన్న విషయం పట్టదు.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయకూడదన్నా వినరు..రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, వితౌట్ హెల్మెట్.. ఇవన్నీ ట్రాఫిక్ ఉల్లంఘనలు. రాజధానిలో మూడు కమిషనరేట్లలో ఈ ఉల్లంఘనులకు ట్రాఫిక్ విభాగం సరాసరిన రోజుకు విధిస్తున్న జరిమానా ఏకంగా రూ.1.62 కోట్లు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు సంబంధించి ఈ ఏడాది జనవరి–అక్టోబర్ 6 మధ్య గణాంకాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ–చలాన్లలో 70 శాతం పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం.
ఇప్పుడంతా నాన్ కాంటాక్ట్ విధానంలో...
ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి జరిమానాలు విధిస్తుంటారు. దీన్నే సాంకేతిక పరిభాషలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌గా పిలుస్తారు. ఇదివరకు కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానం అమలులో ఉండేది. అంటే... క్షేత్రస్థాయి విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉండే చలానా పుస్తకాలను వినియోగించి ఉల్లంఘనులకు జరిమానాలు విధించేవారు. ఆ మొత్తాలను అక్కడికక్కడే వసూలు చేసేవారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో అపశ్రుతులు, ఘర్షణలు చోటుచేసుకునేవి. గోల్‌మాల్ జరిగిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. దీంతో కొన్నేళ్లుగా పూర్తిస్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ట్రాఫిక్ ఉల్లంఘనులకు జరిమానా విధింపు పరోక్షంగా జరిగిపోతుంది. క్షేత్రస్థాయిలో పోలీసులు, సీసీ కెమెరాల ద్వారా తీసిన ఫొటోల ఆధారంగా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లోని సర్వర్ వీటిని జారీ చేస్తుంటుంది.
ఆ డేటానే వీరికి ఆధారం...
ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ–చలాన్లు జారీ చేయడానికి వాహనచోదకుల అడ్రస్ అనివార్యం. దీనికోసం పోలీసు విభాగం ఆర్టీఏ అధికారులపై ఆధారపడుతోంది. వాహనం రిజి్రస్టేషన్ సమయంలో ఇచ్చిన చిరునామా, యజమాని సెల్‌ఫోన్ నెంబర్ల డేటా ఆధారంగా ఈ–చలాన్ల జారీ అవుతోంది. ముద్రించిన కాపీ పోస్టులో, లింకును ఎస్సెమ్మెస్ ద్వారా పంపిస్తున్నారు. అయితే అనేక వాహనాల యజమానులు అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారే. దీంతో వారి చిరునామా వాహనం ఖరీదు చేసిన తర్వాత మారిపోతుంటుంది. ఇదే రకంగా వారి సెల్‌ఫోన్ నెంబర్లు కూడా మారిపోతున్నాయి. కొత్తవి ఆర్టీఏ డేటాబేస్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావట్లేదు. ఈ కారణంగా ఈ–చలాన్లు ఆయా వాహనచోదకులకు చేరట్లేదు. కొందరికి ఇవి అందినా... చెల్లించాలన్న విషయాన్ని వారు పట్టించుకోవట్లేదు.
ఈ–లోక్ అదాలత్ కోసం వెయిటింగ్..
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–చలాన్ జరిమానా బకాయిలు భారం తగ్గించుకోవడానికి అధికారులు 2016 అక్టోబర్ వరకు పలుమార్లు లోక్ అదాలత్‌ల ద్వారా అవకాశం ఇచ్చారు. ఆఖరిసారిగా 2023 డిసెంబర్‌లో ట్రాఫిక్ మెగా లోక్ అదాలత్ జరిగింది. సాధారణంగా మెగా లోక్ అదాలత్ ఒకేరోజు నిర్దేశించిన ప్రాంతంలో జరుగుతుంది. అయితే ట్రాఫిక్ లోక్ అదాలత్ మాత్రం ఆన్‌లైన్‌లో జరిగింది. వాహన రకాన్ని బట్టి 60 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చి మిగిలిన మొత్తం చెల్లించే వెసులుబాటు కలి్పంచారు. ఆ తర్వాత మళ్లీ ట్రాఫిక్ లోక్ అదాలత్ జరగలేదు. అనేకమంది వాహనచోదకులకు తమ వాహనంపై ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసినా, ఉద్దేశపూర్వకంగా చెల్లించట్లేదు. ఈసారి లోక్ అదాలత్ జరిగినప్పుడు డిస్కౌంట్‌తో చెల్లించాలనే ఉద్దేశంతో ఉండిపోతున్నారు. అయితే ఉల్లంఘనులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ట్రాఫిక్ లోక్ అదాలత్‌లు నిర్వహించకూడదని అధికారులు భావిస్తున్నారు.
ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం..
నగరంలో ఉల్లంఘనల తీరుతెన్నులు గుర్తించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ఈ పరిజ్ఞానంతో కూడిన ఓ కెమెరాను ఎంజే మార్కెట్ ప్రాంతంలోని సిద్ధి అంబర్‌బజార్ మార్గంలో ఏర్పాటు చేశాం. ఆ జంక్షన్‌లో అటు–ఇటు కలిపి ఎనిమిది రోడ్లు ఉండగా... ఈ ఒక్క రూటులోనే నెలరోజుల్లో 5 లక్షలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. వాహనచోదకుల్లో రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. పెండింగ్ చలాన్ల విషయం కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు వాహనచోదకుడిని తెలుపుతున్నాం. అధిక చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారిని గుర్తించడానికి క్షేత్రస్థాయిలో టాప్ వైలేషన్ టీమ్స్ పని చేస్తున్నాయి.
– డి.జోయల్ డేవిస్,ట్రాఫిక్ చీఫ్, హైదరాబాద్