Hyderabad: దేశ రాజధానిలో భళా.. ఇక్కడ వెలవెల! 

Hyderabad People Intrest Electric Vehcles Due To Petrol Diesel Price Hike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకూ మరింత పెరుగుతుండటంతో వాహనదారులు దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన విద్యుత్‌ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. సాధారణ వాహనంతో పోలిస్తే విద్యుత్‌ వాహనం ఖర్చు కొంత ఎక్కువే అయినప్పటికీ.. రోజువారి ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉండటంతో మెజార్టీ వాహనదారులు ఇటు వైపు ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే నగరంలో 49 వేలకుపైగా వాహనాలు వచ్చి చేరాయి. మొదట్లో కేవలం స్కూటర్లు మాత్రమే రోడ్లపై కనిపించగా.. ప్రస్తుతం అన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు కూడా రోడ్లపై దూసుకుపోతున్నాయి.   

300 కేంద్రాలు అన్నారు.. 24తో సరిపెట్టారు.. 
గ్రేటర్‌ పరిధిలో మొత్తం 75 లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా. వీటిలో 70 శాతం ద్విచక్ర వాహనాలు, 19 శాతం కార్లు, 11 శాతం ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెట్రోల్, డీజిల్‌పై పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నారు. మనకు ఆయిల్‌ ఎగుమతి చేస్తున్న దేశాల్లో యుద్ధం, ఇతర విపత్తులతో పెద్దఎత్తున సంక్షోభం తలెత్తుతోంది. నగరంలోని వాహనదారులు ఇలాంటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడేందుకు టీఎస్‌ రెడ్‌కో, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా నగరంలో 300 ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇప్పటి వరకు 24 మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి.

వీటిలో కొన్ని పని చేయడం లేదు. కిలోవాట్‌ ఫర్‌ అవర్‌కు రూ.18 వసూలు చేయాలని నిర్ణయించారు. అపార్ట్‌మెంట్లలో ఉంటున్న వారు ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేయాలని ఆశించినా.. ఇంట్లో ఛార్జింగ్‌ పాయింట్‌కు అవకాశం లేకపోవడంతో వారు ఇందుకు వెనుకాడుతున్నారు. అదే రోడ్డు సైడ్‌ పెట్రోల్‌ బంకులు, మెట్రో స్టేషన్ల వద్ద మరిన్ని ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసి వాటిని ఆన్‌లైన్‌తో అనుసంధానిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.  

సరిపడా చార్జింగ్, బ్యాటరీ కేంద్రాలు లేక ఇక్కట్లు 
ఢిల్లీలో విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ కోసం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 597 ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు ఈజెడ్‌ యాప్‌ను, బెంగళూరులో ఈవీమిత్ర యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చార్జింగ్‌ కేంద్రాలు, బ్యాటరీ మార్పిడి సెంటర్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. కానీ నగరంలో ఇప్పటి వరకు ఈ దిశగా అడుగులు వేయలేదు. అంతేకాదు నగరంలో వాహనాల నిష్పత్తి మేరకు నగరంలో చార్జింగ్‌ కేంద్రాలు, బ్యాటరీ మారి్పడి స్టేషన్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది.

రెండేళ్ల క్రితం టీఎస్‌ రెడ్‌కో ఎనర్జీ స్టోరేజీ పేరుతో ఒక విధానం రూపొందించింది. డీజిల్, పెట్రోల్‌ ఎంత సులభంగా లభిస్తుందో అంతే సులభంగా ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయకపోవడంతో ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు కొనుగోలు చేస్తున్న వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పొరపాటున ఛార్జింగ్‌ అయిపోయి బండి రోడ్లు మధ్యలో ఆగిపోతే.. ఇతర వాహనాల సహాయంతో వాటిని ఇంటి వరకు తోసుకొని వెళ్లాల్సి వస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top