సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన ఆనందం.. చివరకు అదే మంచు పర్వతాల్లో శాశ్వత నిద్రగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) మృతదేహాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. “ఆయన ఇప్పుడు సాక్షాత్తూ పరమశివుడి చెంతనే ఉన్నారు” అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు.
గత వారం ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అరుణ్ కుమార్.. తిరుగు ప్రయాణంలో ‘హిల్లరీ స్టెప్’ సమీపంలో తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. ఆ సమయంలో ఆయనతో పాటు నలుగురు షెర్పాలు ఉన్నట్లు నేపాల్‌కు చెందిన యాత్ర నిర్వాహక సంస్థ ‘పయనీర్ అడ్వెంచర్స్’ తెలిపింది. అయితే 8 వేల మీటర్ల ఎత్తుకు పైబడిన ‘డెత్ జోన్’లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో మృతదేహాన్ని కిందకు తీసుకురావడం దాదాపు అసాధ్యమని నిపుణులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే అరుణ్ కుటుంబ సభ్యులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. “ఎవరెస్ట్ అంటే పరమశివుడి నివాసమైన కైలాసమే. ఆయన అక్కడే శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాలని భావించాం. అంత ఎత్తు నుంచి మృతదేహాన్ని తీసుకురావడం కూడా చాలా ప్రమాదకరం. తీసుకొచ్చేసరికి దేహం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది” అని అరుణ్ బావ సుధీర్ ఉపాధ్యాయ మీడియాకు తెలిపారు.
అరుణ్ కుమార్ తివారీ కేవలం ఐటీ ప్రొఫెషనల్ మాత్రమే కాదు.. అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు కూడా. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన.. ఇప్పటికే మౌంట్ ఎల్బ్రస్, డెనాలి, అకోన్కాగ్వా వంటి పర్వతాలను అధిరోహించారు. 2025లో ఒకసారి ఎవరెస్ట్ యాత్రకు వెళ్లినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా 7,200 మీటర్ల వద్ద నుంచి వెనుదిరిగారు. అయితే ఈసారి తన కలను నెరవేర్చుకుని శిఖరాన్ని జయించారు. కానీ తిరుగు ప్రయాణమే ఆయనకు చివరి మజిలీగా మారింది.
అరుణ్ కుటుంబంలో భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోయినా.. ఆయనకు ఇష్టమైన హిమాలయాల్లోనే శాశ్వత విశ్రాంతి కలగాలని నిర్ణయించడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
ఇదే ఎవరెస్ట్ యాత్రలో మరో తెలుగు వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురానికి చెందిన, అమెరికాలో స్థిరపడిన ఐటీ ప్రొఫెషనల్ సందీప్ అరే(46) మే 20న ఎవరెస్ట్ అధిరోహించి, మరుసటి రోజే తీవ్ర అలసట, స్నో బ్లైండ్‌నెస్‌తో మరణించారు. ఆయన మృతదేహాన్ని షెర్పాలు కిందకు తీసుకురాగా.. బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించారు.
👉ఎవరెస్ట్‌లోని ‘డెత్ జోన్’లో మృతదేహాలను తరలించడం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లలో ఒకటిగా భావిస్తారు. ఆక్సిజన్ కొరత, గడ్డకట్టే చలి, మంచు తుఫానులు, హిమపాతాల ముప్పు మధ్య రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఒక్క మృతదేహాన్ని కిందకు తీసుకురావాలంటే ఎనిమిది నుంచి పన్నెండు మంది అనుభవజ్ఞులైన షెర్పాలు, ప్రత్యేక పరికరాలు, అదనపు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఈ ప్రక్రియకు రోజుల సమయం పట్టడంతో పాటు కోట్ల రూపాయల వ్యయం కూడా అవుతుంది.
అందుకే చాలా కుటుంబాలు.. మరిన్ని ప్రాణాలకు ప్రమాదం కలిగించకుండా తమవారిని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని నిర్ణయిస్తుంటాయి. ఇప్పుడు అరుణ్ కుమార్ తివారీ కుటుంబం కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. అలా మంచు పర్వతాల్లో మొదలైన ఆయన సాహస యాత్ర.. చివరకు శివయ్య చెంతనే శాశ్వత విశ్రాంతిగా ముగిసింది.


