‘ధరణి’ ఇలా దారిలోకి! రంగంలోకి నవీన్‌ మిత్తల్‌

Hyderabad: Ccla Plans To Clear Problems In Dharani Website - Sakshi

25 కీలక సమస్యలపై ట్రెసా నివేదిక 

కొత్త సీసీఎల్‌ఏకు ఇవ్వాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: సమస్యల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ‘ధరణి’ని దారిలోకి తెచ్చేందుకు కొత్త భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ కసరత్తు మొదలుపెట్టారు. మొదటగా ధరణి సమస్యలపై అధ్యయనం చేయాలని భావించారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. రైతులు, రెవెన్యూ వర్గాలు ధరణి పోర్టల్‌ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

మరోవైపు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) ధరణి సమస్యలు, పరిష్కారాలపై తయారు చేసిన నివేదికను కొత్త సీసీఎల్‌ఏకు అందజేయాలని భావి స్తోంది. మొత్తం 25 అంశాలతో రూపొందించిన నివేదికలోని అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా చాలా వరకు ‘ధరణి’సమస్యలను పరిష్కరించవచ్చని చెబుతోంది. 

ధరణి పోర్టల్‌ సమస్యలపై ట్రెసా నివేదికలోని అంశాలివే...
–వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారం తర్వాత కూడా తహసీల్దార్‌/ఆపరేటర్‌ లాగిన్‌లకు సమాచారం రావడంలేదు. సదరు దరఖాస్తులు చేసుకున్న సమయంలోనే తహసీల్దార్‌/ఆపరేటర్‌ లాగిన్‌లలో నోటీసు వచ్చేలా ఆప్షన్‌ ఇవ్వాలి.

–ఒక సర్వే నంబర్‌లోని కొంతభాగం భూమిని గతంలో ఉన్న తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం చేసి ఉంటే, ఆ భూమిని ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయాల్సి వస్తే ఆ సర్వే నంబర్‌లోని అన్ని భూములకూ ప్రస్తుత తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం కనిపిస్తోంది. అలాకాకుండా ఏ తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం చేస్తే వారి సంతకమే కనిపించేలా సరిచేయాలి. 

–తహసీల్దార్‌ లాగిన్‌లలో ప్రస్తుత పహణీ/ భూహక్కుల అంతర్గత పుస్తకం/ పాసు పుస్తకాలు కనిపించడంలేదు. దీంతో రికార్డుల పరిశీలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భూసేకరణ ద్వారా ప్రభుత్వం తీసుకున్న భూములను పరిశీలించే క్రమంలో సమస్యలు వస్తున్నాయి. తహసీల్దార్‌ లాగిన్‌లో ప్రస్తుత పహాణీలు, ఆర్‌వోఆర్‌ఐబీలు, పాసుపుస్తకాలు అందుబాటులో ఉంచాలి. 

–ఉన్న భూమి కంటే ఎక్కువ, తక్కువగా రికార్డయిన వివరాలను సరిచేసే ఆప్షన్‌ ఇవ్వాలి.

–రిజిస్ట్రేషన్‌ జరిగిన డాక్యుమెంట్లకు సర్టిఫైడ్‌ కాపీలు తీసుకునే అవకాశం ప్రస్తుతం ధరణిలో లేదు. కానీ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాత్రం సర్టిఫైడ్‌ కాపీలిస్తున్నారు. వీటి కోసం ప్రజలు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నందున మీసేవా ద్వారా వాటిని తీసుకునే అవకాశం కల్పించాలి. 

–ధరణి ప్రాజెక్టు అందుబాటులోకి రాకముందు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న డాక్యుమెంట్లను రద్దు చేసుకునేందుకు, వాటిల్లోని తప్పులను సరిచేసుకునేందుకు ఆప్షన్‌ ఇవ్వాలి. 

–కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాకముందు తహసీల్దార్లు, ఆర్డీవోలు జారీ చేసిన ప్రొసీడింగ్‌ కాపీలను అమలు చేసే ప్రొవిజన్‌ ఇవ్వాలి. 

–వివాదాల్లో ఉన్న ఇనాం భూములను ప్రాసెస్‌ చేసేందుకు, ఓఆర్‌సీలు జారీ చేసేందుకు ధరణిలో అవకాశం కల్పించాలి. 

–రిజిస్ట్రేషన్‌ జరిగిన తర్వాత మ్యుటేషన్‌ జరిగేలోపు పట్టాదారుడు చనిపోతే ఆ పట్టాదారువారసులకు మ్యుటేషన్‌ చేసే అవకాశం ఇవ్వాలి. 

–అసలైన పట్టాదారులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో కొందరు మీసేవా కేంద్రాల ద్వారా పట్టాభూములను నాలా కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీంతో అసలైన పట్టాదారులకు ఇబ్బంది అవుతోంది. అలాంటి థర్డ్‌ పార్టీ దరఖాస్తులను రద్దు చేసే ఆప్షన్‌ ఇవ్వాలి. 

–సిటిజన్‌ పోర్టల్‌ ద్వారా భూముల నిర్వహణ, సేల్‌ సర్టిఫికెట్, ఎక్సే్చంజ్‌ డీడ్‌లు చేసుకునే అవకాశం పవర్‌ ఆఫ్‌ అటారీ్నలకు ఇవ్వాలి. 

–ధరణిలో తప్పుగా నమోదై, డిజిటల్‌ సంతకాలు కాని ఎంట్రీలను తొలగించే ఆప్షన్‌ ఇవ్వాలి. రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లలో పొరపాటున పడిన చిన్న, చిన్న తప్పులను సవరించుకునే అవకాశం కూడా ఇవ్వాలి. 

– కొన్ని అసైన్డ్‌ భూముల రికార్డుల్లో భూమి స్వభావాన్ని పొరపాటున పట్టా అని నమోదు చేశారు. ఈ కారణంతో ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. ఈ రికార్డులను సరిచేసే ఆప్షన్‌ టీఎం–33లో కనిపించడం లేదు. దీంతో అసైన్డ్‌ భూములకు వారసత్వహక్కులు కూడా కల్పించలేకపోతున్నాం. 

–రెండు ఖాతాలు కలిగిన రైతులు ఒక ఖాతాలో ఆధార్‌ నమోదు చేసుకోకపోతే మళ్లీ నమోదు చేసుకునేందుకు ధరణి పోర్టల్‌ అనుమతించడం లేదు. మీరు నమోదు చేసిన ఆధార్‌ నంబర్‌ ఇప్పటికే ఉందని చూపిస్తోంది. ఈ సమస్యను సవరించాలి. 

–ఆర్డీవో స్థాయిలో ఇప్పటికే ప్రొసిడీంగ్స్‌ వచ్చిన భూములకు వ్యవసాయ కేటగిరీ నుంచి నాలా కేటగిరీకి మార్చుకునే అవకాశం కల్పించాలి. 
–వీలునామాలను అమలు పరిచే ఆప్షన్‌ ఇవ్వాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top