Hyderabad: దంచికొట్టిన భారీ వర్షం.. నిండిన హుస్సేన్ సాగర్.. | Heavy Rains in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: దంచికొట్టిన భారీ వర్షం.. నిండిన హుస్సేన్ సాగర్..

Jul 15 2024 8:19 AM | Updated on Jul 15 2024 9:14 AM

Heavy Rains in Hyderabad

సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: నగరంలో వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు సగటున 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొన్ని చోట్ల కార్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి.

 కాగా.. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ పర్యటించారు. నగరంలోని శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌తో పాటు..దుర్గం చెరువు, నెక్టర్‌ గార్డెన్‌ ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్స్, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని రంగంలోకి దించాలన్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని అంచనా వేయాలని సూచించారు. ఆయన వెంట శేరిలింగంపల్లి సర్కిల్‌ ఈఈ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

అధికారులు అప్రమత్తం.. 
నగరంలో కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులను అప్రమత్తం చేసినట్టు మేయర్‌ గద్వాల్‌ విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. నగరంలోని పరిస్థితిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈవీడీఎం కమిషనర్‌ రంగనాథ్‌ అధికారులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు.  

నిండుకుండలా హుస్సేన్‌ సాగర్‌..  
భారీగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. హుస్సేన్‌సాగర్‌ గరిష్ట స్థాయి నీటి సామర్థ్యం 514.75 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 513.210 మీటర్ల మేర ఉందని అధికారులు తెలిపారు.     

Advertisement
 
Advertisement
Advertisement