తెరుచుకున్న బడులు | Government Schools Reopened In Telangana | Sakshi
Sakshi News home page

తెరుచుకున్న బడులు

Aug 28 2020 3:00 AM | Updated on Aug 28 2020 3:01 AM

Government Schools Reopened In Telangana - Sakshi

హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో రిజిస్టర్లు పరిశీలిస్తున్న టీచర్లు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో మూతబడిన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు గురువారం ఉపాధ్యాయులు విధులకు హాజరవడంతో తెరుచుకున్నాయి. కేంద్రం ఆదేశించే వరకు విద్యార్థుల హాజరుకు అనుమతి లేకపోవడంతో ఉపాధ్యాయులే పాఠశాలల్లో కనిపించారు. తొలిరోజు ఒకరినొకరు పలకరించుకున్నారు. కొత్తగా అటెండెన్స్‌ రిజిస్టర్లు ఎంట్రీ చేయడంతోపాటు స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో శానిటేషన్‌ చేయించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పిల్లలకు వీడియో పాఠాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీడియో పాఠాలు, ఈ–లెర్నింగ్‌ మెటీరియల్, పాఠ్యాంశ ప్రణాళికలు తయారు చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినప్పటికీ 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి టీచింగ్‌ క్యాలెండర్‌ను సర్కారు ఇంకా విడుదల చేయలేదు. ఏటా ఉండే ప్రణాళికను అనుసరిద్దామంటే విద్యా సంవత్సరం తొలి త్రైమాసికం దాదాపు ముగిసింది. దీంతో ఏ పాఠ్యాంశాన్ని పరిగణించి మెటీరియల్‌ రూపొందించాలనే దానిపై ఉపాధ్యాయులకు స్పష్టత లేదు. మరోవైపు మెటీరియల్‌ రూపకల్పనకు సంబంధించి ఎలాంటి సరుకు, సరంజామా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో టీచర్లు తొలిరోజు విధులకు హాజరైనా వీడియో పాఠాలు తయారీ లేకుండానే సాయంత్రానికి ఇంటిబాట పట్టారు. 

రవాణా కష్టాలు...
ప్రస్తుతం ప్రజా రవాణా స్తంభించడంతో విధులకు హాజరయ్యేందుకు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే టీచర్లు సహోద్యోగుల వాహనాలు లేదా సొంత వాహనాల్లో విధులకు హాజరయ్యారు. వాహన సౌకర్యం లేనివాళ్లు మాత్రం ప్రైవేటు వాహనాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. టీచర్లు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపై ఆధారపడి విధులకు హాజరయ్యేవారు. అయితే ప్రధాన రహదారులకే పరిమితమైన బస్సులు... పల్లెబాట పట్టడం లేదు. దీంతో బస్సులు లేక చాలా మంది టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement