
ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రెడీ
అంచనా వ్యయం రూ.150 కోట్లు
పూర్తయితే తీరనున్న ట్రాఫిక్ ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రసూల్‌పురా జంక్షన్ ఒకటి. ఉప్పల్, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి పంజగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు రసూల్‌పురా జంక్షన్ నుంచే వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి మినిస్టర్ రోడ్, కిమ్స్, కవాడిగూడ, ముషీరాబాద్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారూ ఈ జంక్షన్ నుంచే ప్రయాణిస్తారు. సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ వైపు ఎన్ని ఫ్లై ఓవర్లు ఉన్నా రసూల్‌పురా జంక్షన్‌లో మాత్రం ఆగిపోక తప్పడం లేదు. ట్రాఫిక్ ఇబ్బందులతో ఎంతో సమయం వృథా అవుతోంది. వాహనాలకు ఇంధన వ్యయం అధికమవుతోంది. రసూల్‌పురా జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తే ఈ ఇక్కట్లు తగ్గుతాయని భావించిన జీహెచ్‌ఎంసీ సర్వే, ఇన్వెస్టిగేషన్, డీటెయిల్డ్ డిజైన్‌లతో సహా ఫ్లై ఓవర్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది సంబంధిత ఇంజినీర్లు తెలిపారు.
నాలుగు లేన్లతో..
నాలుగు లేన్లతో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.150 కోట్లు. ఇందులో భూ సేకరణ అంచనా వ్యయమే దాదాపు రూ.70 కోట్లు. వై ఆకారంలో రానున్న ఈ ఫ్లై ఓవర్ అప్రోచ్ మార్గం హెచ్‌ఎంఆర్‌ఎల్ బిల్డింగ్ ఉత్తరం వైపు నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో నాలుగులేన్లుగా ఉండే ఫ్లై ఓవర్ క్యారేజ్‌వే 14 మీటర్లుగా ఉంటుంది. రసూల్‌పురా జంక్షన్ దగ్గర నుంచి మినిస్టర్ రోడ్‌వైపు, పాటిగడ్డ రోడ్ వైపు రెండు ఆర్మ్‌లతో వై ఆకారంలో విడిపోతుంది. మినిస్టర్ రోడ్‌వైపు వెళ్లే ఆర్మ్ మూడు లేన్లతో ఉంటుంది. దీని క్యారేజ్‌వే వెడల్పు 11 మీటర్లు, పాటిగడ్డవైపు వెళ్లే మార్గం రెండు లేన్లతో ఉంటుంది. దీని క్యారేజ్‌వే వెడల్పు 7.5 మీటర్లు.
రెండేళ్లలో పూర్తి చేయాలి..
పనులకు ఎంపికయ్యే ఏజెన్సీ పనులు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చాక వాహన ప్రయాణ వేగం కనీసం 40 కేఎంపీహెచ్ నుంచి 65 కేఎంపీహెచ్‌కు పెరగవచ్చని అధికారులు తెలిపారు. ప్రయాణ మార్గం ఒకే వైపు ఉండే ఈ ఫ్లై ఓవర్‌ను హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ కింద ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) విధానంలో చేపడుతున్నారు.