‘యంత్ర’ ముగ్ధులౌతారు

The Future Has Lots Of Robots Few Jobs For Humans - Sakshi

ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రోబోలను పనికిపెట్టారు. వచ్చే వాళ్లకు స్వాగతం చెప్పడం, వాళ్లతో మాటలు కలపడం, భోజనం తీసుకురావడం, వడ్డించడం.. అబ్బో ఇలా రకరకాల పనులను అవే చేయడం చూసి జనం ఆశ్చర్యపోయారు. సింగపూర్‌ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పని చేసే పోలీస్‌ రోబోలను సృష్టించారు. రోడ్ల మీద ఎవరైనా రూల్స్‌ను అతిక్రమిస్తే చాలు.. ‘ఏయ్‌.. సెట్‌ రైట్‌’ అని హెచ్చరిస్తున్నాయి ఇవి. ఇదే సింగపూర్‌లో ఇంటింటికీ వెళ్లి వస్తువులను డెలివరీ చేసే రోబోలూ అందుబాటులోకి వచ్చాయి. ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలేమో సరిహద్దుల్లో గస్తీ కాస్తూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే రోబోలను ఆవిష్కరించారు. వీటన్నింటినీ చూస్తుంటే మున్ముందు ప్రపంచమంతా రోబోలదేనేమో అనిపిస్తోంది కదా. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ కూడా ఇదే చెప్తోంది. 2030 నాటి కల్లా ప్రపంచంలో 2 కోట్ల ఉద్యోగాల్లో రోబోలే ఉంటాయని అంచనా వేస్తోంది.  

రోబోల వాడకం పెరుగుతోందా? 
గత పదేళ్లలో రోబోల వాడకం పరిశ్రమల్లో బాగా పెరిగింది. 2010లో దాదాపు 10.59 లక్షల రోబోలను ఇండస్ట్రీల్లో వాడితే అది 2020 కల్లా మూడు రెట్లు పెరిగి 30.15 లక్షలకు చేరిందని వరల్డ్‌ రోబోటిక్స్‌ 2021 రిపోర్టు వెల్లడించింది. 

ఏయే రంగాల్లో వాడుతున్నారు? 
రోబోలను ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ రంగాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో ఆటోమోటివ్‌ రంగం ఉంది. 2020 నాటికి ప్రపంచ లెక్కలను పరిశీలిస్తే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ రంగాల్లో 1.09 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత ఆటోమోటివ్‌ రంగంలో 80 వేలు.. లోహ పరిశ్రమల్లో 41 వేల రోబోలను వినియోగిస్తున్నారని వరల్డ్‌ రోబోటిక్స్‌ రిపోర్టు 2021 వివరించింది. 

 

వాడకం ఏ దేశాల్లో ఎక్కువ? 
రోబోలను అత్యధికంగా చైనాలో వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్, అమెరికా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా దేశాలున్నాయి. వరల్డ్‌ రోబోటిక్స్‌ రిపోర్టు లెక్కల ప్రకారం 2020 నాటికే చైనాలో 1.68 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్‌లో 38 వేలు, అమెరికాలో 30,800, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియాలో 30,500 వాడుతున్నారు. ఈ లిస్టులో ఇండియా 15వ స్థానంలో ఉంది. మన దేశంలో 3,200 రోబోలను వాడుతున్నారు. 

 

కరోనా సమయంలో.. 
రోబోలకు వైరస్‌ సోకే అవకాశం లేదు కాబట్టి కరోనా సమయంలో వీటి వాడకం పెరిగింది. మున్ముందు మహమ్మారుల సమయంలో రోబోల వాడకం పెరగవచ్చని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ అభిప్రాయపడింది.   

 

ఇళ్లల్లో వాడుతున్నారా? 
రోబోల వాడకం ఇళ్లల్లో కూడా పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2019–2020లో ఒకేసారి 5 రెట్లు మర బొమ్మల వాడకం ఎక్కువైంది. ఈ లెక్కలను ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రోబోటిక్స్‌ (ఐఎఫ్‌ఆర్‌) వెల్లడించింది. ఈ కొనుగోళ్లతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం రూ. 82 వేల కోట్లకు చేరింది. ఇళ్లల్లో వాడే రోబోల అమ్మకాలు మున్ముందు ఊపందుకుంటాయని, ఏటా 46 శాతం వరకు పెరుగుదల ఉంటుందని ఐఎఫ్‌ఆర్‌ వివరించింది. 2022లో దాదాపు 5.5 కోట్ల రోబో యూనిట్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసింది. 

స్పేస్‌లోకి కూడా.. 
వివిధ రకాల పరిశోధనలకోసమని రోబోలను స్పేస్‌లోకి కూడా పంపారు. ఎందుకంటే.. తక్కువ డబ్బుతోనే రకరకాల నైపుణ్యాలతో వీటిని తయారు చేయొచ్చు. పైగా రోదసీలో ఆస్ట్రొనాట్లు చేయలేని ప్రమాదకరమైన పనులను రోబోలతో చేయించవచ్చు. 

‘చిట్టి’ లాంటి రోబోలు ..
ఈ ఏడాది కొత్త రకం రోబోలు ముందుకొచ్చాయి. అచ్చం మనుషుల్లా ఉండే హ్యూమనాయిడ్‌ రోబోలు, ఓషన్‌ రోబోలను వార్తల్లో కనిపించాయి. స్వరాన్ని గుర్తు పట్టడం, వైద్య చికిత్సల్లో పాలు పంచుకోవడం లాంటి అదనపు నైపుణ్యాలను వీటికి జోడించారు.

– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top