కోరం లేకున్నా.. బడ్జెట్‌ ఆమోదమే!  | Sakshi
Sakshi News home page

కోరం లేకున్నా.. బడ్జెట్‌ ఆమోదమే! 

Published Fri, Mar 31 2023 3:07 AM

Financial year of municipalities to end on 31st March - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చాలా మునిసిపల్‌ పాలకమండళ్లకు పలువురు సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇవ్వడంతో బడ్జెట్‌ సమావేశాలకు కోరం కరువైంది. కోరం లేకున్నా మునిసిపల్‌ బడ్జెట్లు ఆమోదం పొందుతున్నాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో 2023–24 వార్షిక బడ్జెట్ల ఆమోదానికి శుక్రవారం ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను ఇప్పటికే మూడోవంతు పట్టణ పాలకమండళ్లు సమావేశాలు నిర్వహించి రాబోయే వార్షిక బడ్జెట్లకు ఆమోదం తెలిపాయి.

అయితే ఈసారి పురపాలికల్లో అవిశ్వాసాల రగడ మొదలవడంతో చాలా మునిసిపాలిటీల్లో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. మునిసిపల్‌ చట్టసవరణకు గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడంతో మూడేళ్ల పదవీకాలం పూర్తయిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫిబ్రవరిలో అవిశ్వాసాల ప్రక్రియ సాగింది. ఇందులో భాగంగా జగిత్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఏకంగా రాజీనామా కూడా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు హుజూరాబాద్, వికారాబాద్, తాండూర్, యాదగిరిగుట్ట, ఆలేరు, చండూరు, జనగాం, దమ్మాయిగూడెం, జవహర్‌నగర్‌ కార్పొరేషన్, చౌటుప్పల్, నాగార్జునసాగర్, ఇబ్రహీంపట్నం తదితర 37 మున్సిపల్‌ పాలకమండళ్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు.

అవిశ్వాస ప్రతిపాదనల గడువును మూడేళ్ల పదవీకాలం నుంచి నాలుగేళ్లకు పెంచిన సవరణ చట్టం గవ­ర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌లే హైకోర్టును ఆశ్రయించి 29 చోట్ల స్టే తెచ్చుకున్నారు. మిగతా మునిసిపాలిటీలకు సంబంధించి కూడా ఎలాంటి పురోగతి లే­దు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ముగియనున్న పా­త ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆమోదించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.  

కోరంతో సంబంధం లేకుండా ఆమోదం 
అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్లు నిర్వహించే బడ్జెట్‌ సమావేశాలకు సభ్యులు హాజరుకాని పరిస్థితి నెలకొంది. ఇటీవల కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో బడ్జెట్‌ సమావేశం నిర్వహించగా, కోరం లేక తొలిరోజు వాయిదా పడింది. మరుసటిరోజు కోరంతో సంబంధం లేకుండా సమావేశాన్ని నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించారు. అదే జిల్లాకు  చెందిన కొత్తపల్లి మునిసిపాలిటీలో అవిశ్వాస నోటీసు ఇవ్వకపోయినా, సరిపడా సభ్యులు రాలేదు. అయినా కోరంతో సంబంధం లేకుండా మరుసటిరోజు బడ్జెట్‌ను ఆమోదించారు.  

అభివృద్ధిని అడ్డుకునే కుట్రల్లో భాగమే... : వెన్‌రెడ్డి రాజు, మునిసిపల్‌ చాంబర్స్‌ చైర్మన్‌  
రాష్టంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమే ‘అవిశ్వాసాలు’. నాలుగేళ్ల పదవీకాలం వరకు అవిశ్వాస తీర్మానానికి ఆస్కారం లేకుండా చేసిన సవరణ చట్టానికి గవర్నర్‌ ఆమోదించకపోవడంతో ఈ గందరగోళం నెలకొంది. బడ్జెట్‌ ఆమోదానికి కోరంతో సంబంధం లేదు. తొలిరోజు కోరం లేకుండా వాయిదా పడితే, మరుసటి రోజు ఏకపక్షంగా ఆమోదించే అధికారం సభకు ఉంటుంది.    

Advertisement
Advertisement