RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనులు షురూ! | Final Alignment Of Regional Ring Road Was Finalized The Consultancy Firm | Sakshi
Sakshi News home page

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనులు షురూ!

Aug 14 2021 4:13 AM | Updated on Aug 14 2021 8:30 AM

Final Alignment Of Regional Ring Road Was Finalized The Consultancy Firm - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘రీజనల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)’ అలైన్‌మెంట్‌ ఖరారు పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు కన్సల్టెంట్‌ సంస్థ కేఅండ్‌జే ప్రైవేటు లిమిటెడ్‌.. నాలుగు రోజులుగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు 50–70 కిలోమీటర్ల అవతల 339 కిలోమీటర్ల పొడవున రీజనల్‌ రింగు రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని రెండు భాగాలుగా విభజించారు. అందులో ఉత్తర భాగం అయిన సంగారెడ్డి–నర్సాపూర్‌–తూప్రాన్‌–గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌–జగదేవ్‌పూర్‌–యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్‌ వరకు ఉండే 164 కిలోమీటర్ల రోడ్డును కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లు ఖర్చవుతాయని ప్రస్తుత అంచనా. ఈ భాగానికి సంబంధించి తుది అలైన్‌మెంట్‌ ఖరారు పనిని కన్సల్టెన్సీ సంస్థ ప్రారంభించింది. 

ప్రాథమిక అలైన్‌మెంట్‌ వెంట.. 
ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో కన్సల్టెన్సీ సేవలు అందించిన బెంగుళూరు సంస్థ ప్రాథమికంగా ఒక అలైన్‌మెంటును నిర్ధారించింది. అక్షాంశ, రేఖాంశాలు, గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా దానిని రూపొందించారు. ఇప్పుడా అలైన్‌మెంట్‌ ఆధారంగానే క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. మార్గమధ్యలో నీటి వనరులు, భారీ నిర్మాణాలు, కొండలు, గుట్టల వంటివి ఎక్కడైనా అడ్డుగా వస్తాయా అనేది పరిశీలించి.. రోడ్డు అలైన్‌మెంట్‌ను పక్కకు మార్చనున్నారు. ముఖ్యంగా ఇటీవల పలు ప్రాంతాలకు కాళేశ్వరం నీటిని తరలించే కాల్వలు నిర్మించారు. ఆయాచోట్ల పరిస్థితికి తగినట్టు అలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. రీజనల్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని.. త్వరగా కసరత్తు పూర్తి చేయాలని కన్సల్టెన్సీని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల్లో అలైన్‌మెంట్‌ ఖరారు పూర్తిచేసి, ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి సేకరించాలనే విషయంలో స్పష్టత ఇచ్చే దిశగా కన్సల్టెన్సీ చర్యలు చేపట్టినట్టు సమాచారం. 

ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రస్తుతం నాలుగు వరుసల్లో ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. భవిష్యత్తులో ఎనిమిది వరుసలకు విస్తరిస్తారు. ఇందులో ప్రధాన రోడ్డుతోపాటు సర్వీసు రోడ్లు ఉంటాయి. మొత్తం ఎనిమిది వరుసల రహదారి 80 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మరో 20 మీటర్ల అదనపు స్థలాన్ని చేర్చి.. 100 మీటర్ల వెడల్పు ఉండేలా భూమిని సేకరించనున్నారు. 

నేతల ఒత్తిళ్ల మధ్య.. 
రీజనల్‌ రింగు రోడ్డు ప్రతిపాదన రాగానే నేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకే భూములు కొన్నారు. ఇప్పుడా భూములకు చేరువగా రోడ్డు ఉండాలని, అదే సమయంలో తమ స్థలాలపై నుంచి నిర్మించవద్దని ఆశిస్తున్నారు. కాస్త పలుకుబడి ఉన్న బడా వ్యక్తులు అలైన్‌మెంట్‌ ఖరారుపై ప్రభావం చూపేలా ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని, అలైన్‌మెంట్‌కు సంబంధించి స్థానికంగా ఎలాంటి ప్రకటనలూ చేయొద్దని కన్సల్టెన్సీని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తుండటంతో వంపులు లేకుండా చూడాలని స్పష్టం చేసినట్టు సమాచారం. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దక్షిణ భాగంపై పరిశీలన
రీజనల్‌ రింగు రోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారి కింద నిర్మిస్తోంది. ఈ భాగంలో ప్రతిపాదిత పట్టణాలను అనుసంధానిస్తూ ఇప్పటికే రోడ్లు ఉన్నాయి. వాటిమీదుగా పెద్ద సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకుని కొత్తరోడ్డు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంలో ప్రతిపాదిత పట్టణాల (చౌటుప్పల్‌–ఇబ్రహీంపట్నం–కందుకూరు–అమన్‌గల్‌–చేవెళ్ల–శంకర్‌పల్లి–కంది–సంగారెడ్డి)లను అనుసంధానిస్తూ పెద్ద రోడ్లు లేవు. ఎన్ని వాహనాలు తిరుగుతాయన్న స్పష్టత లేదు. దీంతో ఆ లెక్కలు తేల్చాలని జాతీయ రహదారుల విభాగాన్ని కేంద్రం ఆదేశించింది. అధికారులు అధ్యయనం చేసి వారం క్రితం కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించడంపై త్వరలో స్పష్టత రానుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement