గ్యారంటీలకు ఘోరీ | Ex Minister Harish Rao Fires On Cm Revanth Reddy and Bhatti Vikramarka: Telangana | Sakshi
Sakshi News home page

గ్యారంటీలకు ఘోరీ

Mar 21 2026 4:29 AM | Updated on Mar 21 2026 4:29 AM

Ex Minister Harish Rao Fires On Cm Revanth Reddy and Bhatti Vikramarka: Telangana

సీఎం, డిప్యూటీ సీఎంలపై హరీశ్‌రావు ఫైర్‌

ఇది ప్రజలను నిరాశపరిచే బడ్జెట్‌

వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్ల పెంపు ఊసే లేదు 

మహిళలకు ఇస్తామన్న రూ.2,500, నిరుద్యోగ భృతి 

రూ.4 వేల ప్రస్తావనే లేదు 

క్యూర్, ప్యూర్, రేర్‌ కాదు.. చోర్, గోల్‌ మాల్‌ మోడల్‌ అన్న బీఆర్‌ఎస్‌ నేత

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘోరీ కట్టారని బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్‌రావు విమర్శించారు. ఇది దగాకోరు, ప్రజలను తీవ్రంగా నిరాశపరిచే బడ్జెట్‌ అని అన్నారు. వృద్ధాప్య, దివ్యాంగుల పింఛను పెంపు ఊసే లేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ప్రస్తావన కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4 వేల గురించిన కనీస ఊసు కానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేస్తూ అందులోనూ గత బడ్జెట్‌తో పోలిస్తే కోతలు పెట్టారన్నారు.

ఆరు గ్యారంటీల విషయంలో గతేడాది రూ.56 వేల కోట్లు పెడితే, ఈ బడ్జెట్‌లో రూ.50 వేల కోట్లకు కుదించారని పేర్కొన్నారు. కొత్త పింఛన్లు కాదు ఉన్న పింఛన్లు ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. 3 లక్షల పింఛన్లు తొలగించి, 2 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శుక్రవారం ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్‌లతో కలిసి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు.  

20 పేజీలు, రూ.20 వేల కోట్లు పెంచారు తప్ప.. 
    ‘బడ్జెట్‌ ప్రసంగాన్ని 20 పేజీలు, బడ్జెట్‌ను రూ.20 వేల కోట్లు పెంచారే తప్ప.. ఆరు గ్యారెంటీల ఊసెత్తలేదు. నిధుల కేటాయింపు చేయలేదు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప.. ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత బడ్జెట్‌లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు. మళ్లీ అవే పథకాలు వల్లవేశారు. గత బడ్జెట్‌లోనే రాజీవ్‌ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు కానీ పైసా విడుదల చేయలేదు. మళ్లీ ఈసారి బడ్జెట్‌లో అంతే మొత్తాన్ని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనూ అదే జరిగింది. ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీల పేర్లు చెప్పివారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు..’అని హరీశ్‌రావు విమర్శించారు. 

మూడు ముక్కలు చేయడం తప్ప.. 
    ‘తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌ పేరిట, హైదరాబాద్‌ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా మూడు ముక్కలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. క్యూర్, ప్యూర్, రేర్‌ కాదు.. చోర్‌ మోడల్, గోల్‌మాల్‌ మోడల్‌. బడ్జెట్‌ అంతా బోగస్‌. అభయహస్తం కాదు రిక్త హస్తమని ప్రజలకు అర్థమైంది. పింఛన్ల పెంపు ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు ప్రయోజనాలు లేవు. అన్ని కులాలకు, వర్గాలకు మొండిచేయి చూపారు.  

మూడేళ్లు కాకుండానే రూ.3.5 లక్షల కోట్ల అప్పలు 
    మూడేళ్లు నిండకముందే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేశారు. అంత అప్పు చేసి ఒక్క రూపాయితో ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా? కేసీఆర్‌ కాళేశ్వరం కట్టారు. మిషన్‌ భగీరథ అమలు చేశారు. మెడికల్‌ కాలేజీలు కట్టించారు. కేసీఆర్‌ తాను తెచ్చిన అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించారు. మీరు వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 29 శాతానికి పెంచారు..’అని బీఆర్‌ఎస్‌ నేత విమర్శించారు.  

ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని.. 
    ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని అంబేడ్కర్‌ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బూడిద నుంచి ఫీనిక్స్‌ పక్షిలాగా ఎగిరింప చేసింది. ఆ ఫీనిక్స్‌ పక్షిని బూడిద చేసిన పాపం మీది. స్కాంలు తప్ప స్కీంలు ఉన్నాయా? మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ కేబినెట్‌ మంత్రి కుమార్తెనే చెప్పారు. నాసిరకం పనులతో నాలుగు రోజులకే భాగోతం బయటపడింది. ఇండస్ట్రియల్‌ హబ్‌ కాదు.. కరప్షన్‌ హబ్‌గా మార్చారు. సింగరేణిని స్కాంల ఖనిగా, కుంభకోణాల కేంద్రంగా మార్చారు. గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్‌ ఇండియా స్కూళ్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు. మీ పాలనలో 167 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. 

పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి 
    ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులు అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. డిప్యూటీ సీఎం భట్టి దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని అంటుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం దివాళా తీసింది అంటున్నారు. ఇందులో ఏది నిజం? దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువ అంటున్నారు. కానీ బీఆర్‌ఎస్‌ పాలనలో 14 శాతం ఉంటే, కాంగ్రెస్‌ పాలనలో 10 శాతం మాత్రమే. మా పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే, కాంగ్రెస్‌ పాలనలో 10.7 శాతానికి తగ్గింది. 

పాలనలో ఫెయిల్‌ 
మీరు పాలనలో ఫెయిల్‌ అయ్యారు. హైడ్రా కూల్చివేతలు, మీ మూర్ఖత్వం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. గతేడాది యాసంగిలో సన్నరకం వడ్లకు రూ.వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. భూముల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు. మేము నోటిఫికేషన్లు ఇస్తే.. నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మీరే ఇచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబితే..భట్టి ఇవ్వలేదంటున్నారు..’అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.  

మహాలక్ష్మీలో రూ.2,800 కోట్లు బకాయి 
    ‘మహాలక్ష్మీ కింద ప్రభుత్వం రూ.2,800 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రూ.9,222 కోట్లు ఇస్తే సంస్థ రూ.3 వేల కోట్ల అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లో ఉంటే పింఛన్‌ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు కారి్మకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు?..’అని మాజీమంత్రి నిలదీశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement