నాటి కేబినెట్‌ ఆమోదంతోనే | Etela Rajender Kaleshwaram Commission Inquiry | Sakshi
Sakshi News home page

నాటి కేబినెట్‌ ఆమోదంతోనే

Jun 7 2025 3:27 AM | Updated on Jun 7 2025 3:28 AM

Etela Rajender Kaleshwaram Commission Inquiry

విచారణ అనంతరం మాట్లాడుతున్న ఈటల

కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణం నిర్ణయాలపై మాజీ మంత్రి ఈటల స్పష్టికరణ 

తుమ్మిడిహెట్టి బదులు మేడిగడ్డకు బరాజ్‌ ప్రాంతం మార్పుపై నిర్ణయం నాటి సీఎందే 

సాంకేతిక కమిటీ సిఫారసులను మంత్రివర్గ ఉపసంఘం, మంత్రివర్గం ఆమోదించింది 

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆశించిన ఆదాయం రాలేదు 

జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు వెల్లడి.. 20 నిమిషాల్లో ముగిసిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని నాటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ బరాజ్‌ల ఏర్పాటుపై చేసిన సిఫారసులపై నాటి ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, తనతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి ఆమోదించిందని గుర్తుచేసుకున్నారు.

ఆ తర్వాత మంత్రివర్గం ఆమోదించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని కార్యాలయంలో ఈటల రాజేందర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. పలు కీలక ప్రశ్నలు సంధించింది. కేవలం 20 నిమిషాలపాటు ఆయన్ను కమిషన్‌ విచారించింది. ఆయనతోపాటు వచ్చిన కొందరు బీజేపీ నేతలు, అనుచరులను కమిషన్‌ కోర్టు హాల్‌లో కూర్చోవడానికి అంగీకరించింది. 

ప్రాంతం మార్పుపై నిర్ణయం సీఎందే.. 
ఎవరి ఆలోచన ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం చేపట్టారని కమిషన్‌ తొలుత ప్రశ్నించగా ఈటల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘రూ. 38 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఆ రాష్ట్రంలో ముంపు నివారణకు బరాజ్‌ ఎత్తును 150 నుంచి 148 మీటర్లకు తగ్గించాలని కోరింది. వన్యప్రాణుల అభయారణ్యం ఉండటంతోపాటు అక్కడ నీటిలభ్యత సైతం లేదని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రాజెక్టు కింద 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు పట్టణ తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామీణ తాగునీటికి 15 టీఎంసీలు, పరిశ్రమలకు 10 టీఎంసీల నీళ్లు అవసరం.

తుమ్మిడిహెట్టి వద్ద అంత నీటి లభ్యత లేకపోవడంతోనే అక్కడి నుంచి మేడిగడ్డకు బరాజ్‌ లొకేషన్‌ను మార్చాం. నాటి సీఎం (కేసీఆర్‌) నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక కమిటీ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి బరాజ్‌ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి అంచనా వ్యయం అప్పట్లో రూ. 63 వేల కోట్లు. సాగునీటి కోసం వేర్వేరు ప్రాంతాల రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తీర్చడానికి అంచనా వ్యయాన్ని రూ. 83 వేల కోట్లకు పెంచడం జరిగింది. ఆ తర్వాత అంచనా వ్యయం పెరుగుతూ పొయింది. ఇప్పుడు ఎంతో తెలియదు’అని ఈటల పేర్కొన్నారు. 

బరాజ్‌ల లొకేషన్లను సూచించింది ఎవరు?  
ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై సంతకాలు చేశారా? అని మళ్లీ కమిషన్‌ ప్రశ్నించగా అవునని ఈటల బదులిచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్లను నిపుణుల కమిటీ సూచించిందా? అని కమిషన్‌ ప్రశ్నించగా గోదావరిపై వేర్వేరు చోట్ల అధ్యయనం జరిపి చివరకు ఆ మూడు లొకేషన్లను నిపుణుల కమిటీ అంగీకరించిందని ఈటల బదులిచ్చారు. ఆ లోకేషన్ల వద్ద బరాజ్‌లను నిర్మించాలన్న నిర్ణయం ప్రభుత్వానిది కాదా? అని కమిషన్‌ మళ్లీ అడగ్గా ఆర్థిక శాఖతో సంబంధం లేకపోవడంతో సమాధానం ఇవ్వలేనని ఈటల పేర్కొన్నారు. డీపీఆర్‌ తయారీ కోసం వ్యాప్కోస్‌ సంస్థకు రూ. 5.94 లక్షలు చెల్లించాలని 2015 ఏప్రిల్‌ 13న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందా? అని కమిషన్‌ అడగ్గా తనకు గుర్తు లేదన్నారు.  

‘కాళేశ్వరం’తో ఆశించిన ఆదాయం రాలేదు... 
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు లేకపోవడంతో రుణాల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌)ను ఏర్పాటు చేయాలని నాడు నిర్ణయించామని ఈటల రాజేందర్‌ మరో ప్రశ్నకు బదులిచ్చారు. కేఐపీసీఎల్‌ ఆర్థిక శాఖ పరిధిలోకి రాదని.. నీటిపారుదల శాఖ గజ్వేల్‌ ఈఎన్‌సీ బి.హరిరామ్‌ దీనికి అధిపతిగా వ్యవహరించారని గుర్తుచేశారు. అన్ని శాఖల రుణాలకు ఇచ్చినట్లే కేఐపీసీఎల్‌ రుణాలకు సైతం ఆర్థిక శాఖ పూచీకత్తు ఇచ్చిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే రుణాలను తిరిగి చెల్లించాలని విజయ బ్యాంకు రాసిన లేఖను కమిషన్‌ ప్రస్తావించగా.. ప్రాజెక్టు ద్వారా తాగు, పరిశ్రమల అవసరాలకు నీటి సరఫరాతో వచ్చే ఆదాయంతో రుణాలు తిరిగి చెల్లిస్తామని కాగితాల్లో చూపినా వాస్తవికంగా అంత ఆదాయం వసూలు కాలేదని ఈటల వివరణ ఇచ్చారు. బడ్జెటేతర రుణాలతో బరాజ్‌లను నిర్మించారా? అని కమిషన్‌ అడగ్గా ఆ వ్యవహారాలతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని బదులిచ్చారు. నీటిపారుదలశాఖతోపాటు కేఐపీసీఎల్‌లు ఈ వ్యవహారాలు చూశాయన్నారు. బరాజ్‌ల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదా? అని కమిషన్‌ ప్రశ్నించగా దీనితో ఆర్థిక శాఖకు సంబంధం లేదన్నారు. నీటిపారుదల శాఖలోని అకౌంట్స్‌ విభాగం ఈ వ్యవహారాలు పర్యవేక్షిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement