సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. ఈ క్రమంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తుల కేటాయింపులు చేసింది. దీంతో, గుర్తుల విషయమై గత అనుభవాల దృష్ట్యా బీఆర్‌ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గతంలో ఈ సింబల్స్ తొలగించాలని బీఆర్‌ఎస్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కారు గుర్తుకు దగ్గరగా ఉన్న గుర్తుల కారణంగా సింబల్స్ గుర్తింపులో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని బీఆర్‌ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, ఈ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్‌లో అభ్యర్థుల కలర్ ఫొటోలను సైతం ఎన్నికల సంఘం ఇవ్వనుంది. కాగా, బ్యాలెట్ పేపర్‌లో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (కమలం), రెండో స్థానం కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్‌యాదవ్ (హస్తం), మూడో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ (కారు)కు కేటాయించారు.
ఇదిలా ఉండగా.. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో సాయిరాం వెల్లడించారు. అయితే, ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.
2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈ సారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు.


