దసరా ఎఫెక్ట్‌.. ఆర్టీసీలో రికార్డు స్థాయిలో ప్రయాణాలు | Dussehra rush continues on TGSRTC buses | Sakshi
Sakshi News home page

దసరా ఎఫెక్ట్‌.. ఆర్టీసీలో రికార్డు స్థాయిలో ప్రయాణాలు

Oct 12 2026 8:00 PM | Updated on Oct 12 2026 8:09 PM

 Dussehra rush continues on TGSRTC buses
  • టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ
  • ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా అదనపు బస్సులు
  • ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలి: ఆర్టీసీ ఎండీ

సాక్షి, హైదరాబాద్‌: దసరాను పురస్కరించుకుని ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) నడుపుతున్న ప్రత్యేక బస్సు సర్వీసులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దసరా రద్దీ నిర్వహణ, అదనపు బస్సుల ఆపరేషన్లపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి సోమవారం అధికారులతో జూమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సర్వీసులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ దసరా సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో సర్వీసులను నడుపుతూ మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించింది. గత ఏడాది (2025) దసరా తొలి మూడు రోజుల్లో 922 అదనపు బస్సులను నడపగా... ఈ ఏడాది అక్టోబర్ 9, 10, 11 తేదీలలో గతంతో పోలిస్తే 495 బస్సులు అదనంగా, అంటే మొత్తం 1,417 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా దసరా పండుగ వేళ మహిళలకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. 

గత ఏడాది దసరా సమయంలో రోజుకు సగటున రూ. 13.02 కోట్లు ఆదా కాగా, ఈ ఏడాది దసరా రద్దీ సమయంలో మహిళలు రోజుకు రూ. 13.73 కోట్ల మేర ఆదా చేసుకోగలినట్లు ఆర్టీసీ ప్రకటించింది.పండుగ ముందు రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వంత ఊర్లకు  ప్రయాణమయ్యే వారి కోసం ఈ నెల 15, 16, 17 తేదీల్లో కూడా రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడపాలని అధికారులను ఎండీ వై. నాగిరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని, ఇతర వివరాలు మరియు ప్రయాణ సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించారు.

ఇదీ చదవండి: రాహుల్‌వి మతిలేని మాటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement