
హైదరాబాద్: నెత్తిమీద మహరాజులు ధరించే టోపీ, ఒంటి మీద కుర్తా, అలనాటి లెగ్గిన్, వంకీలు తిరిగిన బూట్లు, మెడలో రాజహారాలు, చేతులకు కడియాలు, రాజసంగా ఓ చేతిలో కత్తి ధరించి గుర్రపు బగ్గీపై నామినేషన్ వేసేందుకు వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడో ఇండిపెండెంట్ అభ్యర్థి. ఎల్‌బీనగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరబోగ వసంత రాయలు ప్రజాపతి (వీబీవీఆర్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం నియోజకవర్గానికి వచ్చారు.
యూసుఫ్‌గూడలోని పోచమ్మబస్తీ నుంచి ఆయన ఈ విధమైన వేషధారణతో గుర్రపు బగ్గీపై వెళ్తుండగా అందరూ మొబైల్ కెమెరాలతో క్లిక్ మనిపించారు. ప్రజాక్షేమమే లక్ష్యమని, సంపాదన ముఖ్యం కాదని అందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.