48.47%  పెరిగిన సైబర్‌ నేరాలు 

DGP Ravi Gupta Released Telangana State Crime Records Bureau - Sakshi

ఆర్థిక నేరాల్లోనూ 41 శాతం వృద్ధి 

సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ సాయంతో 18 వేలకు పైగా కేసుల పరిష్కారం 

క్రైమ్‌ ఇన్‌ తెలంగాణ 2022 పుస్తకంలో వెల్లడి 

దేశంలో అత్యంత భద్రమైన నగరాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం 

సీఐడీ విభాగం రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన డీజీపీ రవి గుప్తా 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గతంతో పోలిస్తే సైబర్‌ నేరాల నమోదు 48.47 శాతం పెరిగినట్టు తెలంగాణ పోలీస్‌ శాఖ వెల్లడించింది. ఆర్థిక నేరాలు, మోసాలు సైతం పెరిగినట్టు క్రైమ్‌ ఇన్‌ తెలంగాణ–2022 పుస్తకం వెల్లడించింది. తెలంగాణ సీఐడీ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన క్రైమ్‌ ఇన్‌ తెలంగాణ–2022 పుస్తకాన్ని సీఐడీ అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్‌తో కలిసి డీజీపీ రవిగుప్తా మంగళవారం డీజీపీ కార్యాలయంలో విడుదల చేశారు.

2021తో పోలిస్తే తెలంగాణలో 2022లో ఆర్థిక నేరాల్లో 41.37 శాతం పెరుగుదల నమోదైందనీ, అదేవిధంగా మోసాలకు సంబంధించిన కేసుల్లోనూ 43.3 శాతం పెరుగుదల ఉన్నట్టు పుస్తకంలో వెల్లడించారు. నేషనల్‌ క్రైమ్‌రికార్డ్స్‌బ్యూరో(ఎన్‌సీబీఆర్‌) తరహాలోనే రాష్ట్ర సీఐడీలోని స్టేట్‌క్రైమ్‌ రికార్డ్స్‌బ్యూరో(ఎస్సీఆర్బీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నేరాల నమోదు, నేరాల సరళిని తెలియజేసేలా పూర్తి వివరాలతో కూడిన ‘‘క్రైం ఇన్‌ తెలంగాణ–2022’’పుస్తకాన్ని రూపొందించారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఈ తరహాలో క్రైం ఇన్‌ తెలంగాణ పుస్తకాన్ని రూపొందించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.  

రాష్ట్ర వ్యాప్తంగా 10.25 లక్షల సీసీటీవీ కెమెరాలు 
రాష్ట్రంలో సీసీటీవీ కెమెరాల సంఖ్య 10,25, 849కు చేరినట్టు క్రైం ఇన్‌ తెలంగాణ–2022 పుస్తకం వెల్లడించింది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 1,74,205 సీసీటీవీ కెమెరాలను కొత్తగా ఏర్పాటు చేశారు. కాగా 2022లో నమోదైన 18,234 కేసులను ఛేదించడంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీ కీలకంగా పనిచేసినట్టు పేర్కొంది. ఎన్‌సీఆర్బీ 2022 నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత భద్రమైన నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచినట్టు పుస్తకంలో పేర్కొన్నారు.

భద్రమైన నగరాల్లో మొదటి స్థానంలో కోల్‌కతా, రెండో స్థానంలో పుణే నిలిచింది. కాగా, క్రైమ్‌ ఇన్‌ తెలంగాణ–2022 పుస్తకం రూపొందించడంలో కీలకంగా పనిచేసిన ఎస్సీఆర్బీ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు సీహెచ్‌ చెన్నయ్య, సర్దార్‌ సింగ్, ఇన్‌స్పెక్టర్లు ఎస్‌ శేఖర్‌రెడ్డి, ఎన్‌ నవీన్‌బాబు, హెడ్‌ కానిస్టేబుళ్లు పి కృష్ణకుమారి, ఎన్‌ హుస్సేన్‌లను డీజీపీ రవిగుప్తా, అడిషనల్‌ డీజీ మహేశ్‌భగవత్‌ అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top