
ఖమ్మం జిల్లా: జిల్లా వేదికగా కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. దేశ వ్యాప్తంగా ఓట్లు తొలగింపు అంశానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంశాన్ని లేవనెత్తుతూ ఈరోజు(గురువారం, ఆగస్టు 14వ తేదీ) ఖమ్మం జిల్లాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో మల్లు భట్టి విక్రమార్క సైతం పాల్గొన్నారు.
దీనిపై మల్లు మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ దేశంలో ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని, ఓట్లు ఉన్నవారివి తీసినట్లుగా ఆధారాలతో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించారు. రాహుల్ గాంధీ అడుగుతున్న సాప్ట్ కాపీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే...దానికి సమాధానం చెప్పకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.
వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ చేపట్టే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది. దేశానికి డిక్టేటర్‌షిప్ పరిపాలన తీసుకుని రావాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి లొంగిపోయింది. దేశ ప్రజలు వాస్తవాన్ని గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ముందుకు రావాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి, వాటికి సంబంధించి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ముందు ప్రవేశ పెట్టారు’ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.