
ఏజీతో సమావేశమైన మంత్రులు భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటాపై కసరత్తు షురూ
నేడు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఢిల్లీలోని న్యాయ కోవిదుల అభిప్రాయ సేకరణ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ పార్టీ నియమించిన మంత్రుల కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఆదివారం ప్రజాభవన్‌లో కమిటీ సమావేశమై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయం తీసుకుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
శ్రీధర్‌బాబులు హాజరయ్యారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో కమిటీతో తన అభిప్రాయాన్ని పంచుకోగా, ఇంకో మంత్రి సీతక్క గైర్హాజరయ్యారు. సమావేశంలో భాగంగా కులగణన నుంచి బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపేంతవరకు జరిగిన కార్యాచరణ, న్యాయపరంగా ఈ బిల్లు ఆమోదానికి తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి ఎన్నికలకు వెళితే.. ఎదురయ్యే అడ్డంకులు తదితర అంశాలపై ఏజీ సుదర్శన్‌రెడ్డితో కమిటీ చర్చించింది.
ఆయన అభిప్రాయాలను విన్న కమిటీ సోమవారం కులగణనపై నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డితోపాటు అభిషేక్ మనుసింఘ్వి తదితర ఢిల్లీలోని న్యాయ కోవిదుల అభిప్రాయాలను కూడా తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఈనెల 26వ తేదీకల్లా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నివేదిక అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. ఆ తర్వాత ఈనెల 29న జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వ నిర్ణయం వెల్లడి కానుంది.