సీఎం రేవంత్‌రెడ్డికి బడ్జెట్ ప్రతులు అందజేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కార్యదర్శి గౌరవ్ ఉప్పల్
మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు
లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. తెలంగాణ బ్రాండ్‌పై నమ్మకం కల్పించాం
2026–27 బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తాం
ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమే సర్కారు లక్ష్యం
రాష్ట్రాన్ని సుస్థిరమైన అభివృద్ధి వైపు నడిపించేలా బడ్జెట్‌కు రూపకల్పన
రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి, విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యం
గత రెండున్నరేళ్లుగా ఇదే బాటలో సాగుతున్నాం..
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తూ పాలన గాడిలో పెడుతున్నాం
ఇవి కేవలం అంకెలు కాదని, ప్రజల జీవనగతిని మార్చే లెక్కలన్న ఉప ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్ అని స్పష్టికరణ
సాక్షి హైదరాబాద్: ‘ధీరోదాత్తుడు ఎన్నడూ అవరోధాలకు బెదరడు. అవరోధాలనే అవకాశాలుగా మలచుకుని ముందుకు సాగుతాడు. ఇప్పుడు రాష్ట్రంలో మా ప్రభుత్వం అదే చేస్తోంది. ప్రగతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అందుకే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్‌పై నమ్మకం కలిగించాం. ఇక పురోగతిలో మా మార్కు చూపుతాం. గత రెండున్నరేళ్లుగా ఈ బాటలోనే సాగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటికి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెడుతున్నాం.
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచి్చన హామీలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ‘ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే మా లక్ష్యం. మేము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం.
రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రాన్ని సుస్థిరమైన అభివృద్ధి వైపు నడిపించేదిగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించాం..’ అని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా చూపించారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఉప ముఖ్యమంత్రి మాటల్లోనే..

పన్నుల సొమ్ము ప్రజల అభ్యున్నతికే..
⇒ వరసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు. మేం ప్రజలిక్చిన హామీలను, ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను ఈ రెండున్నరేళ్ల పాలనలో సంతృప్తి్కరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. పన్నుల రూపంలో వచి్చన సొమ్మును, తిరిగి ప్రజల అభ్యున్నతి కోసమే వెచి్చస్తున్నాం. ప్రతి పైసకు మేం కాపలాదారుగా ఉంటున్నాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, పారదర్శకతతో పాలన సాగిస్తున్నాం.
రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్ట ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. ప్రజల జీవన స్థితిగతుల మార్పునకు దోహదపడే లెక్కలు. ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం.
దేశానికి బలమైన గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ
⇒ 2025–6 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ.17,82,198 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.3,57,13,886 కోట్లుగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంది. దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ 5 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ నిలుస్తోంది.
గణనీయంగా పెరిగిన తలసరి ఆదాయం
⇒ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు 10.2 శాతం. అదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.2,19,575 కాగా వృద్ధిరేటు కేవలం 6.9 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం æ1.9 రెట్లు ఎక్కువ.
⇒ ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రణాళికలను రూపొందిస్తున్నాం.
మరిన్ని కేంద్ర నిధులకు కృషి
⇒ 2014–15 నుంచి 2023–24 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద బకాయి ఉన్న రూ.3 వేల కోట్లను విడుదల చేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం సహకార, సమాఖ్య వాద స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. 2021–22లో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.4,826 కోట్లు రాగా, మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా రూ.7.72 వేల కోట్లను సాధించింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని నిధులను సాధించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది.

గత ప్రభుత్వ అప్పులతో తీవ్ర భారం
⇒ గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి, అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20–39 సంవత్సరాలకు పొడిగించింది. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025–26 నుంచి 2031–32 దాకా చెల్లించాల్సిన రూ.34.58 వేల కోట్ల రుణం రూ.11.915 వేల కోట్లకు తగ్గింది.
లక్షల కోట్ల పెట్టుబడులు
⇒ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రధాన రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ముఖ్య వేదికగా నిలిచింది. దీని ద్వారా దాదాపు రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దావోస్ వేదికగా ఆవిష్కరించిన ‘నెక్స్‌ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 వల్ల రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. సింగపూర్, వియత్నాంకు చెందిన సంస్థల నుంచి మొత్తం రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
వ్యవసాయానికి ప్రాధాన్యం...
⇒ దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడులలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు ప్రతిపాదించాం.
రూ.కోట్లలో మహిళలకు ఆదా
⇒ ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు రూ.9,222 కోట్లు ఆదా చేసుకున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ద్వారా రూ.752 కోట్ల మేర మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటివరకు 10.97 కోట్ల సున్నా బిల్లులు జారీ అయ్యాయి. ఫలితంగా రూ.3,954 కోట్లను ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది.
హైదరాబాద్ సమ్మిళిత, సమాన అభివృద్ధి
⇒ హైదరాబాద్ అభివృ·ద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఔటర్ అవతల, లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లను విలీనం చేస్తూ 3 కార్పొరేషన్లుగా మార్చి సమ్మిళిత, సమాన అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నాం. 30 వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించి దానిని ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించేలా కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో 67,763 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన మానవ వనరులను అందించడంలో రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం.
సంపద సృష్టించి ప్రజలకు పంచడమే మా విధానం
⇒ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా సమతుల్యంగా బడ్జెట్‌ను రూపొందించాం. పన్నులతో సామాన్యుడిపై భారం మోపకుండా, ఉన్న వనరులను సది్వనియోగం చేస్తూ, కొత్త సంపదను సష్టించి, దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం.‘పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి..’ అన్న మహాత్మాగాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దేందుకు పునాది ఈ బడ్జెట్. ఈ పునాది ఆధారంగా ఒక సుందరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణను నిర్మించేందుకు ఇది బ్లూ ప్రింట్.
డిజిటల్ జనగణనకు ముమ్మర ఏర్పాట్లు
⇒ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు మూలాధారమైన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు రాష్ట్రంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది. 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది.
తెలంగాణ ప్రజల ఆశాదీపం
⇒ బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు, అక్షరాలు మాత్రమే కాదు. మన జీవితం. మన భవిష్యత్తు
⇒ కలలు కనే యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించడం
⇒ ఆసరా కోసం చూసే బలహీనులను ఆదుకోవడం
⇒ నీడలేని వారికి నీడ కల్పించడం
⇒ పంట పొలాలకు నీళ్లు పారించడం.. ఫలసాయం పెంచడం
⇒ కష్టపడే వారికి పని కల్పించడం..ఇష్టపడేలా పాలన అందించడం
⇒ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం.
⇒ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా.


