వేలిముద్రలు కొట్టేసి.. బ్యాంకు ఖాతా లూటీ చేసి.. | Sakshi
Sakshi News home page

వేలిముద్రలు కొట్టేసి.. బ్యాంకు ఖాతా లూటీ చేసి..

Published Thu, Jan 5 2023 3:38 AM

Cyber Criminal Fraud Illegal Fingerprint Collection And Aadhaar - Sakshi

సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెర తీస్తున్నారు. తాజాగా ‘ఆధార్‌’ను ఆధారంగా చేసుకుని దోచుకుంటున్నారు. ‘ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎస్‌)’ మోసాలు క్రమంగా పెరుగుతున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాలు హరియాణా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇటీవల పెరిగాయన్నారు. ఇవి తెలంగాణలోనూ అక్కడక్కడ వెలుగు చూస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే తెలంగాణ సీఐడీ విభాగంలోని సైబర్‌ క్రైం పోలీసులు ఈ తరహా కేసులో నిందితుడిని బిహార్‌లో అరెస్టు చేసి నగరానికి తెచ్చారు. ఈ తరహా మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. 
– సాక్షి, హైదరాబాద్‌

ఇలా జరిగితే అప్రమత్తం కావాలి 
మీకు తెలియకుండానే ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ విధానంలో మీ బ్యాంకు ఖాతాలోంచి డబ్బు­లు పోయినట్టు గుర్తిస్తే వెంటనే మీ ఆధార్‌ కార్డుతో అనుసంధానమైన మీ వేలిముద్రలను డిజేబుల్‌ చేసుకోవాలని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. ఆధార్‌ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్‌ చేయొద్దన్నారు. వివిధ మార్గాల్లో దొంగిలించిన వేలిముద్రలను సిలికాన్‌ ఫింగర్‌ ప్రింట్స్‌గా రూపొందించి వాటి ద్వారా ఏఈపీఎస్‌ విధానంలో ఆధార్‌ లింకై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నట్టు తెలిపారు. 

ఈ జాగ్రత్తలు పాటిస్తే..
►ఏఈపీఎస్‌ సదుపాయాన్ని తరచుగా వాడనట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆ సదుపాయాన్ని డీయాక్టివేట్‌ చేసుకోవాలి. 
►మీ బయోమెట్రిక్‌ దుర్వినియోగం కాకుండా ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి (https:// resident. uidai. gov. in/ aadhaar& lockunlock) వెళ్లి ఆధార్‌ బయోమెట్రిక్‌ను లాక్‌ చేసుకోవాలి. ►వీలైనంత వరకు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఆధార్‌కార్డ్‌ కాపీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఆధార్‌కార్డును ఏదైనా ధ్రువీకరణ కోసం వాడాల్సి వస్తే తప్పకుండా మాస్క్‌డ్‌ ఆధార్‌ (ఆధార్‌ నంబర్‌పూర్తిగా కనిపించకుండా ఉండేది) కాపీని వాడుకోవాలి. 
►సైబర్‌ నేరం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్‌కు లేదా  www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలి.  
►అనధికార వెబ్‌సైట్‌లు, ఏజెన్సీల వారికి వేలిముద్రలను ఇవ్వవద్దు.  

మాస్క్‌డ్‌ ఆధార్‌ అంటే?  
ఆధార్‌ కార్డులోని మొత్తం 12 నంబర్లలో మొదటి ఎనిమిది నంబర్లు కనిపించకుండా (వాటి స్థానంలో  గీగీగీ గుర్తులు ఉంటాయి) కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే దాన్ని మాస్క్‌డ్‌ ఆధార్‌ అంటారు. ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మాస్క్‌ ఆధార్‌ ఆప్షన్‌ ఆన్‌ చేసి పెట్టుకుంటే మన ఆధార్‌కార్డు ఆన్‌లైన్‌లో ఎవరు డౌన్‌లోడ్‌ చేసినా పూర్తి వివరాలు కనిపించవు. దీని వల్ల ‘ఆధార్‌’మోసాలు జరగకుండా కాపాడుకోవచ్చు.  

ఏఈపీఎస్‌ అంటే..?  
ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం (ఏపీపీఎస్‌) అంటే.. ఏటీఎంలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఏర్పాటు (మైక్రో ఏటీఎంలుగా పేర్కొనవచ్చు) చేసేవి. ఏ బ్యాంక్‌ ఏజెంట్‌ అయినా ఆధార్‌ అథెంటిఫికేషన్‌ ద్వారా ఇతర ఏ బ్యాంకునకు సంబంధించిన నగదు లావాదేవీలనైనా ఆన్‌లైన్‌లో చేయొచ్చు. ఇందుకోసం ఖాతాదారుడి పేరు, బ్యాంక్‌ ఖాతాకు లింకైన ఆధార్‌ నంబర్, ఆధార్‌ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్ర ఉంటే సరిపోతుంది.

సదరు ఖాతాదారుడు ఏఈపీస్‌ విధానంలో నగదు తీసుకోవాలంటే సంబంధిత బాం్యక్‌ ఏజెంట్‌ దగ్గరకు వెళ్లి బ్యాంకు పేరు, ఆధార్‌ నంబర్, వేలిముద్ర ఇస్తే సరిపోతుంది. సరిగ్గా ఇదే అంశాన్ని కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ విభాగం వెబ్‌సైట్‌ నుంచి వేలిముద్రలను సేకరించి వాటిని సిలికాన్‌ షీట్ల ద్వారా నకిలీ వేలిముద్రలను తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు కొల్లగొడుతున్నారు.   

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement