
మనస్పర్థలు పక్కనబెట్టి పనిచేద్దాం
కాంగ్రెస్ మోసాలు, బీజేపీ ముప్పును ప్రజలకు వివరించాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
బీఆర్‌ఎస్‌లోకి మణుగూరు కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్నచిన్న మనస్పర్థలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటేందుకు కృషి చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం సాధ్యమవుతుందని అన్నారు.
కాంగ్రెస్ చేస్తున్న మోసాలు, బీజేపీతో రాష్ట్రానికి పొంచి ఉన్న ముప్పును ప్రజలకు వివరించాలని సూచించారు. ఎర్రవల్లి నివాసంలో బుధవారం పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఊకంటి ప్రభాకర్ రావు తన అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసినా సింగరేణి ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఓటమి చెందడంపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాచలం, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్‌పై సీబీఐ విచారణ సిగ్గుచేటు
తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు తీర్చిన దార్శనికుడు కేసీఆర్‌పై సీబీఐ విచారణ సిగ్గుచేటు అని కేటీఆర్ విమర్శించారు. ‘సీబీఐని మోదీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే, రేవంత్ ఈ సంస్థను ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి నిదర్శనం. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కళ్లు ఎర్రబడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నాయి. వ్యవసాయ సొసైటీల ముందు రైతులు చెప్పుల వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించింది.
ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్లుగా కాంగ్రెస్ పాలన ఉంది. సీఎం రేవంత్ తన మాటలు, చేతలతో ముఖ్యమంత్రి పీఠానికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారు. హామీల అమలునుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రోజూ కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అంటూ సొల్లు పురాణం చెబుతున్నారు’అని కేటీఆర్ విమర్శించారు.