సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనారిటీ సంఘాల నేతలు. చిత్రంలో షబ్బీర్ అలి, అజహరుద్దీన్ తదితరులు
రేపు 11 గంటలకు ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అజహరుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. దానికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపింది. నవంబర్ 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలో గెలుపొందాలని రెండు పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.
ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదిపింది. అందులో భాగంగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేలా ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహమూద్ అలీ హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మైనారిటీలకు కీలక ప్రాతినిధ్యం ఉండేది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని, పార్టీ పదవుల్లోనూ అంతగా అవకాశాలు రావడం లేదన్న ప్రచారం ఉంది. పైగా మైనారిటీల నుంచి వస్తున్న అసంతృప్తి నేపథ్యంలోనే అజాహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కేబినెట్ బెర్తులు 18: రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 18 మందికి అవకాశం ఉంటుంది.
సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార సందర్భంలో ఆయనతోపాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకట్‌స్వామితోపాటు వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు దక్కాయి. దీంతో కేబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. తాజాగా కేబినెట్‌లోకి అజాహరుద్దీన్‌ను తీసుకున్నా, మరో ఇద్దరికి మంత్రి పదవులకు అవకాశం ఉంటుంది.
గవర్నర్ కోటాకు ఆమోదముద్ర ఎప్పుడో ?
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, కోదండరాం పేర్లను సిఫారసు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పంపింది. అయితే ఆ రెండు ఎమ్మెల్సీలకు గవర్నర్ ఇప్పటివరకు ఆమోదముద్ర వేయలేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకున్నా మంత్రి పదవి కట్టబెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది.
ప్రస్తుత ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్లతో జూబ్లీహిల్స్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అజాహరుద్దీన్‌కు మంత్రి పదవిని ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈనెల 31వ తేదీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ అజాహరుద్దీన్‌కు ఇస్తారని మొదట్లో విస్తృత ప్రచారం జరిగినా, చివరకు బీసీ సామాజికవర్గానికి చెందిన నవీన్‌యాదవ్‌ను దక్కిన విషయం తెలిసిందే.
ఆ ఇద్దరికి లేనట్టేనా..!
మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసారీ నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశించినా, అవకాశం దక్కలేదు. రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో సామాజిక సమీకరణల నేపథ్యంలో అవకాశం దక్కలేదు. సుదర్శన్‌రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించినా నిరాశ మిగిలింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కీలక నిర్ణయంతో మంత్రివర్గంలో అజాహరుద్దీన్‌కు మాత్రమే బెర్త్ లభించింది.
సీఎంతో భేటీ అయిన మైనారిటీ నాయకులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం వివిధ మైనారిటీ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు మైనారిటీ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రకటించారు. సీఎంతో భేటీ అయిన వారిలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, అజాహరుద్దీన్, ఫహీం ఖురేష్, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అజాహరుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


