ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం సందర్భంగా లబ్ధిదారులతో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో జూపల్లి కృష్ణారావు, వివేక్, కొఠారి సర్పంచ్ శాంతాబాయి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుగుణ తదితరులు
ఆ లోపు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధమే: సీఎం రేవంత్‌రెడ్డి
మద్దతు ధర ప్రకటించడమే కాదు, వాటిని కొనుగోలు చేయాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి,మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించట్లే...
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం నేను ఎవరినీ లెక్క చేయను
రెండో విడతలో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం
గుడిసెలు లేని ఆదిలాబాద్‌ను చేస్తాం.. ప్రాణహిత కట్టి తీరుతాం
ఆసిఫాబాద్ జిల్లా ప్రజాపాలన–ప్రగతి బాట
బహిరంగ సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 67 లక్షల క్వింటాళ్ల వడ్లను సేకరించామని, ఇంకా 15 లక్షల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని, వాటన్నింటినీ సేకరిస్తామని, మొత్తం 75 లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటామన్నారు. సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి పంచాయతీ కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను రేవంత్ ప్రారంభించారు. మొదటి విడతలో పూర్తయిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. రెబ్బెన మండలం కొండపల్లి శివారు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సోమవారం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక సభలో మాట్లాడారు.
ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి ప్రల్హాద్ జోషీ పంజాబ్, హరియాణాకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. జూన్ 15లోపు ధాన్యం సేకరణ పూర్తవుతుందని, అన్ని పంటలను మద్దతు ధరతో కొనాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆఫీసు ముందు ధాన్యాన్ని పోస్తామని హెచ్చరించారు. కేంద్రంతో యుద్ధమే ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రైతుల పక్షాన పోరాటం చేసి మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కిషన్‌రెడ్డి తెలంగాణలో తిరగడానికి సమస్య అవుతుందన్నారు. సత్రంలో పెట్టే ఉచిత భోజనానికి నెల్లూరి పెద్దారెడ్డి సిఫారసు తీరుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని, కేంద్రం కొనుగోలు చేసేలా ఆయన బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు భూ సేకరణకు 1500 ఎకరాలు కోసం చర్చిద్దామని లేఖ రాస్తే కిషన్‌రెడ్డి నుంచి ఇప్పటికీ స్పందన లేదన్నారు. బస్సుయాత్ర పేరుతో బీజేపీ నాయకులు రైతుల వద్దకు వెళ్లడం కాదని దుయ్యబట్టారు.
ఎవరినీ లెక్కచేయను
నాలుగు కోట్ల ప్రజల ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతాంగం హక్కులు, సమస్యలే ముఖ్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారి కోసం ఎవరినీ లెక్కచేయని స్పష్టం చేశారు. ఏదైనా నేను మొదట పరిష్కారం చేసుకోవాలని చూస్తానని, అలా కాకపోతే పంచాయతీ పెట్టుకోవడానికి సిద్ధమేనని హెచ్చరించారు. తెలంగాణ అంటే ఎందుకు అంత చిన్నచూపని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎంను ఒప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించకపోగా, మీ ఆలోచన ఏంటని ప్రశ్నించారు. ప్రాణహితపై బరాజ్ కట్టి ఎల్లంపల్లి గ్రావిటీతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతాంగానికి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లను విడిచిపెట్టి, కాళేశ్వరం కడితే కూళేశ్వరంగా మారిందన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ అంతర్రాష్ట్ర నదీ జలాలు పరిష్కారం చేసుకోవాలని చెబుతున్నారని, అయితే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహకరించడం లేదన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి లక్షలాది మందికి అన్యాయం చేశారని చెప్పారు. తాము మనుషులు, ఊళ్లను అడగం లేదని, కేవలం భూమి అడుగుతున్నామని చెప్పారు.
రెండో విడత రెండన్నర లక్షల ఇళ్లు
రాష్ట్రంలో మొదటి విడత 4.50 లక్షల ఇళ్లకు అదనంగా గూడేలకు 21వేలు అదనంగా ఇచ్చాం. లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తున్నాం. ఇంకా ఇళ్లు రాని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రెండో విడతలో అందరికీ ఇళ్లు వచ్చేలా 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 15 నాటికి మరో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గతంలో ఇల్లు వచ్చిన వారికి భాగస్వామ్యం చేసి అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. పేదవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి తీరుతామన్నారు. గిరిజనులు తమకు ఆత్మగౌరవంగా బతికేందుకు ఇళ్లు ఇవ్వాలని కోరారని చెప్పారు.
అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్‌రావు, పాల్వాయి హరీశ్‌బాబు, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, వంశీక్రిష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని కెరమెరి మండలం కొఠారి గ్రామపంచాయతీ కొత్తగూడలో లబ్ధిదారులు సిడాం కన్నిబాయి, ఆత్రం పోచుబాయి, టేకం పగ్గబాయి ఇందిరమ్మ ఇళ్లను సర్పంచ్ మడావి శంతాబాయితో కలిసి ప్రారంభించారు. కాసేపు నేలపైనే కూర్చుని లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ పర్యటనలో ఆరు సబ్‌స్టేషన్లు, రెబ్బెన మండలం నంబాలలో 2 మెగావాట్ల సోలార్‌ప్లాంట్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో మొత్తం రూ.112.14కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
గుడిసెలు లేని ఆదిలాబాద్‌ను చేస్తాం
గుడిసెలు లేని ఆదిలాబాద్‌ను చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది వరకు అవసరమైన ప్రతీ ఒక్కరికి ఇంటిని మంజూరు చేస్తామన్నారు. ఇందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా అధికారులతో వివరాలు తీసుకుని ఇవ్వాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వివక్ష లేని పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెలు ఉన్న చోట్ల కూడా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు ఇవ్వాలని సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలను కోరారు. ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదని, మంచిర్యాలలో ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కోరారు.
మీ పిల్లల్ని చదివిస్తామని మాటివ్వండి..
‘ఉచిత విద్యుత్, బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు సౌకర్యాలన్నీ కల్పిస్తాం. కానీ ప్రతిఫలంగా నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటేనని అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివాసీ మహిళల్ని అడిగారు. ‘మీరు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే మీ పిల్లలను మాత్రం చదివించాలని కోరుతున్నా.. చదివిస్తామని మాట ఇవ్వండి అని ఆదివాసీ మహిళలను కోరారు. చదువు ఒక్కటే మార్పు తెస్తుందన్నారు. కొత్తగూడలో 25 ఇళ్లు పూర్తికాగా వాటిని పరిశీలించారు.


