మా పాలన దేశానికే రోల్‌ మోడల్‌ | CM Revanth Reddy Unveils Nallamala Declaration: Telangana | Sakshi
Sakshi News home page

మా పాలన దేశానికే రోల్‌ మోడల్‌

May 20 2025 4:47 AM | Updated on May 20 2025 4:47 AM

CM Revanth Reddy Unveils Nallamala Declaration: Telangana

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

శాంతిభద్రతల నిర్వహణ, నిరుద్యోగం నిర్మూలనలో తెలంగాణ నంబర్‌ వన్‌ 

16 నెలల్లో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం  

60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం  

గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా సౌర జలవికాసం పథకం  

అచ్చంపేట నియోజకవర్గంలోని  రైతులందరికీ ఉచితంగా సోలార్‌ పంప్‌సెట్లు  ఇస్తామన్న సీఎం

నాగర్‌కర్నూల్‌ జిల్లా మాచారంలో పథకం ప్రారంభం 

బహిరంగ సభ వేదికగా నల్లమల డిక్లరేషన్‌ ప్రకటన

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ సాక్షి, నాగర్‌కర్నూల్‌
‘మా పాలన దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. శాంతిభద్రతల నిర్వహణ, నిరుద్యోగం నిర్మూలన, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం మా పాలనను అభినందించక తప్పని పరిస్థితి నెలకొంది. మా పాలనలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాం. గత 16 నెలల్లో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం. మరో 1.50 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించాం. గత ప్రభుత్వ పాలనలో నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి.

మా పాలనలో మాత్రం నోటిఫికేషన్లు వాయిదా వేయాలని ధర్నాలు జరుగుతున్నాయి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబం బాగుపడుతుంది. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేసేలా ప్రణాళిక రూపొందించాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద మాచారంలోని 29 మంది చెంచు రైతులకు చెందిన 45 ఎకరాల పోడు భూముల్ని ప్రభుత్వం ఎంపిక చేసింది.

వాటిల్లో బోర్లు, సోలార్‌ పంప్‌ సెట్‌తో పాటు మామిడి, ఉద్యాన మొక్కలు నాటారు. కాగా ఆయా భూముల్లోని సోలార్‌ పంప్‌సెట్‌ను ముఖ్యమంత్రి ఆన్‌ చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా నల్లమల డిక్లరేషన్‌ను ప్రకటించి మాట్లాడారు. 

వాళ్లు భూములు గుంజుకున్నారు.. మేం పంటలు ప్రోత్సహిస్తున్నాం     
    ‘గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోడు రైతుల భూములను గుంజుకుని వారికి బేడీలు వేసి జైలుకు పంపింది. ములుగు, తాడ్వాయి అడవుల్లో ఆడబిడ్డలను చెట్టుకు కట్టేసి కొడితే మేం వెళ్లి అండగా నిలబడ్డాం. కాంగ్రెస్‌ వచ్చాక గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా సౌర జలవికాసం అమలు చేస్తున్నాం. గిరిజనుల పోడు భూముల్లో సోలార్‌ విద్యుత్, బోర్లు ఏర్పాటు చేసి వారు పంటలను పండించేలా ప్రోత్సహిస్తున్నాం.   

అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం 
నేను ఇక్కడి నల్లమల ప్రాంతానికి చెందిన వాడినని చెప్పుకునేందుకు నా గుండె ఉప్పొంగుతోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ రానున్న వంద రోజుల్లో ఉచితంగా సోలార్‌ బోర్లను ఏర్పాటు చేస్తాం. సోలార్‌ విద్యుత్‌ వినియోగంతో పాటు ఉత్పత్తి చేసి నెలనెలా రూ.ఐదారు వేల ఆదాయం కల్పించేలా చూస్తాం. నియోజకవర్గంలో ఎన్ని సోలార్‌ పంప్‌సెట్లైనా ఉచితంగా ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. 

సన్న బియ్యంతో పేదల ఆత్మగౌరవం పెంచాం.. 
గతంలో రైతులు వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి వేసుకున్నడు. మేం వచ్చాక సన్నాలు పండించాలని చెప్పి రూ. 500 బోనస్‌ అందించాం. ఏడాదిలో 2.80 లక్షల మెట్రిక్‌  టన్నుల వరి పండించి దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిపాం. రేషన్‌ బియ్యంగా సన్న బియ్యాన్ని అందించి పేదల ఆత్మగౌరవాన్ని పెంచాం.’ అని సీఎం చెప్పారు.  

ప్రధాని అంటే ఇందిరా గాందీలా ఉండాలి.. 
    ‘భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధం సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను రెండు ముక్కలు చేశారు. ఇప్పటికి 50 ఏళ్లైనా ప్రధాని అంటే ఇందిరాగాం«దీలా ఉండాలని అంటారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో మేం ప్రజల కళ్లల్లో వెలుగులు నింపేలా పని చేస్తున్నాం. అక్రమ సంపాదనతో ఎవరెన్ని కుట్రలు చేసినా, మా ఆడబిడ్డలకు అన్నీ తెలుసు. సన్నాసులంతా కలసి సోషల్‌ మీడియాలో ఎంత ప్రచారం చేసినా, మహిళలకు నిజం తెలుసు. కడుపు నిండా విషం కక్కుతూ మా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారి దిక్కు చూడం, పట్టించుకోం..’ అని రేవంత్‌ అన్నారు.  

దేశ చరిత్రలో ఎక్కడా లేదు: భట్టి విక్రమార్క 
    భూమి కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించి నీటి సౌకర్యం కలి్పంచిన ఉదంతాలు దేశంలో ఎక్కడా లేవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నల్లమల డిక్లరేషన్‌ ద్వారా రాష్ట్రంలోని గిరిజనుల కోసం సంకల్పం తీసుకోవడంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహరి, మేఘారెడ్డి, అనిరు««ద్‌రెడ్డి పాల్గొన్నారు. 
 
స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో రేవంత్‌ పర్యటన 
సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గజమాల, పూలతో ఊరేగింపుగా వచ్చి ఘన స్వాగతం పలికారం. కాగా ముఖ్యమంత్రి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తన సొంత ఇంట్లో భోజనం చేశారు.  

ఏమ్మా.. నీళ్లు పడ్డాయా?
చెంచు మహిళలతో సీఎం సంభాషణ 
సాక్షి, నాగర్‌కర్నూల్‌:  ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంబోత్సవం సందర్భంగా మాచారంలోని చెంచుల పోడు భూములను సందర్శించిన ముఖ్యమంత్రి.. అక్కడే ఉన్న చెంచు మహిళలు ఉడుతనూరి అలివేలు, లక్షమ్మలను పలకరించారు. వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. 
సీఎం: ఏమ్మా.. మీ బోరులో నీళ్లు పడ్డాయా? 
అలివేలు: మా భూమిలో వేసిన బోరులో నీళ్లు మంచిగా పడ్డాయి సర్‌. సంతోషంగా ఉంది.  
సీఎం: ఏం మొక్కలు నాటారు, వాటిని బతికించుకుంటారా? 
అలివేలు: మామిడి, ఆవకాడో, బత్తాయి మొక్కలు నాటాం. బాగా కాపాడుకుంటాం సర్‌. ఇన్నాళ్లు మా భూమి బీడుగానే ఉంది. ఇప్పుడు పంటలు పండించుకుంటాం. 
సీఎం: ఈ పథకంపై ఇతర మహిళలకు శిక్షణ ఇస్తావా? 
అలివేలు: నేను డిగ్రీ పూర్తి చేశాను సర్‌. తప్పకుండా మా తోటి మహిళలకు, చెంచులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తా. మీరు మా కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది  

‘పోడు’కు నిధుల తోడు 
గిరిజన సంక్షేమం లక్ష్యంగా నల్లమల డిక్లరేషన్‌ 
నల్లమల డిక్లరేషన్‌లో రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు అంశాలను పొందుపర్చింది. రాష్ట్రంలోని 2,30,735 మంది గిరిజనులకు 2006 ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం సంక్రమించిన సుమారు 6.69 లక్షల ఎకరాల భూములపై పూర్తి హక్కులను గుర్తించింది.  

రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల పోడు భూముల్లో నూరు శాతం ఉచితంగా బోరుబావులు, సోలార్‌ విద్యుత్‌ సౌకర్యంతో పాటు ఉద్యాన పంటల ప్లాంటేషన్‌ ఏర్పాటు చేస్తారు. పోడు భూముల్లో నీటి సౌకర్యం కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధుల కేటాయిస్తారు. 
ఇందిరా సౌర  గిరి జలవికాసం పథకం కింద గిరిజనులకు జీవనోపాధి కల్పించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు 
తొలుత మాచారంలో పైలట్‌ ప్రాజెక్ట్‌. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు 

ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు ఐదేళ్ల పాటు లబి్ధదారులతో సర్కారు సమన్వయం. ఎప్పటికప్పుడు అటవీ, విద్యుత్, భూగర్భ జలవనరులు, ఉద్యాన శాఖల పర్యవేక్షణ  
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెంచులు, ఆదిమ జాతుల కుటుంబాలు అందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 
రాజీవ్‌ యువవికాసం కింద ప్రత్యేకంగా గిరిజన యువతకు రూ.1,000 కోట్ల నిధులతో ఒక్కొక్కరికీ రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాలు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement