అంతర్రాష్ట్ర జలాల్లో ప్రొరేటా వాటా! | CM Revanth Reddy Reviews Monsoon Preparedness | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర జలాల్లో ప్రొరేటా వాటా!

Jun 2 2026 5:18 AM | Updated on Jun 2 2026 5:18 AM

CM Revanth Reddy Reviews Monsoon Preparedness

ఎల్‌నినోతో రాష్ట్రంతోపాటు ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలోనూ వర్షాభావ పరిస్థితులు

ఎగువ రాష్ట్రాల్లోని జలాశయాలు నిండితేనే నీటిని విడుదల చేస్తే రాష్ట్రానికి ఇబ్బందులు 

ప్రొరేటా ప్రకారం రాష్ట్ర వాటా జలాల విడుదలకు ఆ రాష్ట్రాలతో చర్చించాలి

వానాకాలం సన్నద్ధతపై వివిధ శాఖలతో సమీక్షలో సీఎం రేవంత్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితు లు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను రాబ ట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లోని జలాశయాలు నిండిన తర్వాతే నీటిని విడుదల చేసే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలోనూ వర్షాభావ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉండడంతో అంతర్రాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా సాధించడానికి ముందుగానే ఆయా రాష్ట్రాల అధికారులతో చర్చించాలని ఆదేశించారు.

వానాకాలం సన్నద్ధతపై సోమవారం సచివాలయంలో వివిధ శాఖలతో సీఎం సమీక్షించారు. మహారాష్ట్రలోని కోయనా డ్యామ్‌ నీటిని వంద శాతం జల విద్యుదుత్పత్తికే మహారాష్ట్ర వినియోగిస్తోందని.. ఆ మొత్తం నీటిని మనం తీసుకొని ప్రత్యామ్నాయంగా వారికి విద్యుత్‌ సరఫరా చేసే అంశంపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్మితమైన సీలేరు, తుంగభద్ర ప్రాజెక్టుల విద్యుత్‌ కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాపై నివేదిక రూపొందించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. 

వాతావరణ అంచనాలకు తగ్గట్టూ పంటల సాగు
వాతావరణ శాఖ అంచనాలను పరిగణనలోకి తీసుకొని పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు. పంటల మార్పిడి, పంట వైవిధ్యత, తక్కువ నీరు వినియోగించుకునే పంటలు, ఇతర పంట రకాల సాగుపై రైతు వేదికల నుంచి రైతులకు అవగాహన కల్పించాలని, ఏఐ సాంకేతికతతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించాలని ఆదేశించారు. గతేడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో తాను పర్యటించి ఇచ్చిన హామీల అమలులో పురోగతిపై అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

క్యూర్‌లో వరద నీటి సంరక్షణకు 141 బావులు 
క్యూర్‌ పరిధిలోని 3 కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి నీటి సంరక్షణ బావులు నిర్మించాలని గతంలో నిర్ణయించామని, వాటి పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే 11 బావుల నిర్మాణం పూర్తి చేశామని, మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement