రోబోటిక్ ఏనుగు వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, మధుయాష్కీ, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు
కబ్జాదారుల కోరలు పీకేందుకే హైడ్రా
గుర్రంగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్‌సిటీ నిర్మాణం
కాలుష్య రహిత నగరాన్ని ప్రజలకు అందివ్వడమే లక్ష్యం
వనమహోత్సవం– 2026 ప్రారంభించిన సీఎం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కొంతమంది చేసిన కబ్జాలతో వేలాది మంది మునిగిపోతున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము వరదలో కొట్టుకుపోతోంది. చెరు వులు, కుంటలను మనుషులు ఆక్రమిస్తే.. నీళ్లు మనుషులు నివాసం ఉండే కాలనీలను ఆక్రమిస్తున్నాయి. కబ్జాదారుల కోరలు పీకేందుకే హైడ్రాను తెచ్చాం. ఇది వారి వీపును సున్నం సున్నం చేస్తుంది. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయితే కొంతమంది దీన్ని ఓ భూతంలా చూపిస్తున్నారు. అది ఏనాడైనా ప్రైవేటు ఆస్తుల జోలికి వచ్చిందా? చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన ఆక్రమణలను మాత్రమే కూల్చివేసింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.
భారత్ ఫ్యూచర్‌సిటీ నిర్మించి తీరుతాం..’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం గుర్రంగూడలోని అర్బన్ ఫారెస్ట్‌లో వనమహోత్సవం– 2026 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ‘నాగలింగం’ మొక్కను నాటారు. రోబోటిక్ ఎలిఫెంట్‌ను ఆవిష్కరించారు.
రూ.17.82 కోట్ల అంచనాతో 102 ఎకరాల్లో చేపట్టబోయే ఎకో అర్బన్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.17.66 కోట్ల అంచనా వ్యయంతో పలుజిల్లాల్లో చేపట్టే అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఆ నగరాలను దృష్టిలో ఉంచుకునే..
‘హైడ్రా వనస్థలిపురంలోని దేవుడి భూములు సహా కబ్జాలో ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలకు ఇప్పటికే విముక్తి కల్పించింది. చెరువులు, కుంటలు, నాలాలను పునరుద్ధరించింది. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, అనేక మంది కోటీశ్వరులు నివసించే దేశ రాజధాని ఢిల్లీ నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు విష వలయంలో చిక్కుకుపోయింది.
అక్కడి గాలి, నీరు విషమైంది. రోడ్లు, పాఠశాలలు బంద్ చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు బయటికి వెళ్లలేని పరిస్థితి. బెంగళూరులో ఎప్పుడు ఏమౌతుందో తెలియని దుస్థితి. అక్కడి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మన నగరాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాం. విశ్వ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. కాలుష్య రహిత నగరాన్ని ప్రజలకు అందివ్వడమే లక్ష్యం. జూబ్లీహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు తరహాలో 424 ఎకరాల విస్తీర్ణంలోని గుర్రంగూడ అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తాం.
ఫ్యూచర్‌లేని వాళ్లు అడ్డుకుంటామంటున్నారు..
ఆనాడు ఒక్క సిరీస్ ఫ్యాక్టరీతో ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలన్నీ కలుషితమయ్యాయి. అనేక మంది బతుకులు ఆగమయ్యాయి. ఆ కంపెనీ మూసివేత తర్వాతే ఇక్కడి భూములకు విలువ పెరిగింది. మూసీ కాలుష్యం వల్ల నల్లగొండ జిల్లాలో పుట్టే పిల్లల కాళ్లు, చేతులు వంకరపోతున్నాయి. సాయంత్రమైతే చాలు దోమలు దిల్‌సుఖ్‌నగర్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
నల్లగొండ జిల్లా ప్రజలు విషంలోనే బతకాలా? మూసీ ప్రక్షాళన చేపట్టాలని, కాలుష్య రహిత అహ్లాదకరమైన నగరాన్ని ప్రజలకు అందించాలని 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎన్జీటీ సహా ఇతర కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటోంది. ఫ్యూచర్‌లేని వాళ్లు ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటారా..?’ అని సీఎం మండిపడ్డారు. నువ్వెట్టా గెలుస్తావో చూస్తా అంటూ పరోక్షంగా మాజీమంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు అవతలి వైపే అభివృద్ధి
‘ఇప్పటివరకు అభివృద్ధి అంతా నగరానికి అవతలి వైపే జరిగింది. ఎల్బీనగర్‌లో మాత్రం జరగలేదు. సంతోష్ నగర్, సైదాబాద్ అభివృద్ధి బాట పట్టలేదు. పాతబస్తీ, చిన్న గ్రామాలను వదిలేశారు. నిధులు ఇవ్వలేదు. మన ఓట్లతో గెలిచి మరోవైపు అభివృద్ధి పనులు చేసేవారు. మేం కోహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్లు, పూల మార్కెట్‌ను తీసుకొచ్చాం. తాజాగా ఎల్బీనగర్ వాసులకు మంచి పార్కు అందించబోతున్నాం. ఎల్బీనగర్ అంటే నాకు ప్రత్యేక అభిమానం.
రాజకీయ కుట్రలో భాగంగా 2018 ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిపోయా. అంతా రేవంత్ రాజకీయ శకం ముగిసిందని అన్నారు. సరిగ్గా 4 నెలల తర్వాత కాంగ్రెస్ నన్ను మల్కాజిగిరి ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దించింది. 30 వేల మెజార్టీని ఎల్బీనగర్ ప్రజలు అందించారు. నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. భుజాన మోశారు. మల్కాజిగిరి ఎంపీగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచి్చంది. మూడేళ్లు గట్టిగా కొట్లాడి ప్రజాపాలనను తీసుకొచ్చుకున్నం..’ అని సీఎం చెప్పారు.
అభివృద్ధిని ఆపం: శ్రీధర్‌బాబు
‘తాము ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాటం చేసి 16 ఎకరాలు కాపాడే ప్రయత్నం చేస్తే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాత్రం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని లేని చెట్లను, వన్యమృగాలను ఉన్నట్లు సృష్టించింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అభివృద్ధిని అడ్డుకుంది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు చుట్టూ అండర్ గ్రౌండ్ టన్నెల్‌కు ప్రయత్నిస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధిని ఆపబోం..’ అని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రకృతి పరిరక్షణ ఓ సామాజిక బాధ్యతగా భావించి, పుడమి తల్లికి హరిత వందనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలోని 42 నర్సరీల్లో నాలుగు కోట్ల మొక్కలు సిద్ధం చేశామని తెలిపారు.
తెలంగాణలోని 33 జిల్లాల్లో రూ.16.06 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అటవీ శాఖ అధికారి సువర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీఎన్‌రెడ్డినగర్ ప్రాంతంలో ఉన్న జీవో 118 సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ఎల్‌బీనగర్ పార్టీ ఇన్‌చార్జి మధుయాష్కీగౌడ్ వినతిపత్రం ఇచ్చారు.


