
సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బీసీ కేవలం నల్గొండ జిల్లాకే కాదని.. తెలంగాణకు అత్యంత కీలకమన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి ఎస్‌ఎల్‌బీసీలో అవకాశం ఉందన్నారు.
‘‘శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలి. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2027 డిసెంబరు 9 లోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయాలి. ఎస్‌ఎల్‌బీసీ పనులకు గ్రీన్ ఛానల్‌లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలి. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకోను.
..సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. ఎస్‌ఎల్‌బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎస్‌ఎల్‌బీసీ పూర్తి కావాలి. పనులు ఆగడానికి వీలు లేదు’’ అని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.