
బుధవారం బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి
సామాజిక బాధ్యతగా పేదలకు సేవలందించండి
వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
నిమ్స్, ఉస్మానియా లాంటి ఆసుపత్రుల్లో వారం రోజులు పనిచేసినా చాలు
సేవలందించేందుకు అమెరికా వైద్యులు సిద్ధం..
అందరి కోసం ఓ వేదిక
ఏఐజీ ఆస్పత్రి సేవలు మనకందరికీ గర్వకారణం
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి భారతరత్న కోసం తన వంతు కృషి చేస్తానన్న సీఎం
బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆస్పత్రి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘రాష్ట్రంలో చదువుకున్న వైద్యులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏడాదిలో 11 నెలలు మీకు నచ్చిన ఆసుపత్రిలో, మీకు నచ్చిన వేతనానికి పనిచేయండి. మీకు నచ్చిన జీవితాన్ని లీడ్ చేయండి. మిగతా నెలరోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయండి. సామాజిక బాధ్యతగా పేదలకు వైద్యం అందించండి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిమ్స్, ఉస్మానియా వంటి ఆసుపత్రుల్లో వారం రోజులు పనిచేసినా చాలని, ఏ ఆసుపత్రిలో పనిచేయాలనుకుంటున్నారో ముందుగా తెలియజేయాలని కోరారు. అమెరికా నుంచి వచ్చే వైద్యులూ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇటువంటి వారందరినీ ఒక వేదికపైకి తీసుకొస్తామని తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆసుపత్రి ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు.
రోగాల నివారణకు పరిశోధనలు జరగాలి
‘ఈ రోజు ఖరీదైనది ఏదైనా ఉందంటే అది వైద్యం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. అప్పట్లో రూ.2 లక్షలు ప్రకటిస్తే, ఈ రోజు దానిని రూ.10 లక్షలకు పెంచాం. సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.1,400 కోట్లు చెల్లించాం. ఇదంతా రోగం వచ్చిన తర్వాత బాగు చేయడానికి ఖర్చు చేస్తున్నాం. కానీ రోగాలను నివారించేందుకు ముందస్తుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.
60 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ సమయంలో హైదరాబాద్‌లో ఐడీపీఎల్ ప్రారంభించారు. డాక్టర్ రెడ్డీస్, ఎస్‌ఓఎల్, హెటిరో యాజమాన్యాలు ఐడీపీఎల్ మాజీ ఉద్యోగులేనని భావిస్తున్నా. ఏఐజీ ఆసుపత్రికి వైద్య సేవల కోసం 66 దేశాల నుంచి రోగులు వస్తున్నారు. ఇది మనందరికీ గర్వకారణం. గతంలో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు వైద్యం అంటే లావాదేవీలన్నట్లుగా మారింది.
అయితే నగర ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని అభినందిస్తున్నా. ఆయన హైదరాబాద్‌కు, తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారు. నాగేశ్వర్‌రెడ్డి సేవలను గుర్తించిన కేంద్రం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఆయనకు భారతరత్న ఒక్కటే మిగిలి ఉంది. భారతరత్నకు ఆయన అర్హులు. దీని కోసం ముఖ్యమంత్రిగా నావంతు ప్రయత్నం చేస్తా. ఆయనకు ఖచ్చితంగా భారతరత్న వస్తుందని భావిస్తున్నా..’ అని సీఎం చెప్పారు.
డిసెంబర్ నాటికి అందుబాటులోకి 7 వేల పడకలు
‘గోషామహాహల్‌లో రూ.3 వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి పనులు ప్రారంభించాం. హైదరాబాద్ నిమ్స్, వరంగల్‌లో 2 వేల పడకల చొప్పున, టిమ్స్ అల్వాల్, ఎల్‌బీనగర్, సనత్‌నగర్‌లో వెయ్యి పడకల చొప్పున కొత్తగా మొత్తం 7 వేల పడకలు ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రి అనగానే ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని దూరం చేసేలా పనిచేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
జపనీస్ నేర్చుకోవాలి
‘రాష్ట్రంలో విద్యకు రూ.21,500 కోట్లు, వైద్యానికి రూ.11,500 కోట్ల వ్యయంతో అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. జీసీసీ, ఐటీ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ గమ్యస్థానంగా నిలుస్తోంది. మధ్య, తూర్పు దేశాల నుంచి వచ్చే రోగులు ఢిల్లీ, బెంగళూరు, కొల్‌కతాలో దిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిని కలిసి హైదరాబాద్‌కు నేరుగా విమానాలు నడిపించాలని కోరాం. జపాన్‌లో వయసు పైబడిన వారు అధికంగా ఉన్నారు. అక్కడ వైద్య సేవలు ఎక్కువగా అవసరం ఉన్నాయి. కాబట్టి మన దగ్గర నర్సింగ్ సిబ్బంది జపాన్ భాష నేర్చుకోవాలి..’ అని రేవంత్ సూచించారు.
తెలంగాణ ప్రణాళికలో నాగేశ్వర్‌రెడ్డి భాగస్వాములు కావాలి
‘భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా ముందుకెళుతోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ప్రభుత్వం డాక్యుమెంట్ తయారు చేస్తోంది. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్‌గా ఉంటుంది. హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో కోటి మంది మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి, ఒక్కొక్కరికి యూనిక్ నంబరుతో గుర్తింపు కార్డు అందిస్తాం. రాష్ట్రం చేపట్టే ప్రణాళికలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నా.
మనమే నంబర్ వన్
తలసరి ఆదాయం, రెవెన్యూ, శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్ నియంత్రణలో మనమే నంబర్–1. డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఇటీవల దుబాయ్‌లో నిర్వహించిన పోటీలో హైదరాబాద్‌కు ప్రథమ బహుమతి వచ్చింది. నగర సీపీ సీవీ ఆనంద్ దాన్ని అందుకున్నారు. ఇలాంటివన్నీ మనం బ్రాండింగ్ చేసుకోవాలి. ఇటీవల ఒకవైపు యుద్ధ వాతావరణం.. మరోవైపు ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి.
శాంతిభద్రతల సమస్యపై చర్చలు జరుగుతున్న సమయంలో.. హైదరాబాద్‌లో ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా హైలీ ప్రొటెక్టెడ్ సిటీ (అధిక రక్షణతో కూడిన నగరం) అనే విశ్వాసాన్ని కల్పించగలిగాం. అయితే కొన్ని దేశాలు భారత్‌ను ఇంకా వెనుకబడిన దేశంగానే చూస్తున్నాయి. దీన్నుంచి బయటపడాలి..’ అని సీఎం అన్నారు.
140 గ్రామాలు దత్తత తీసుకున్న ఏఐజీ
ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పటాన్‌చెరు సమీపంలోని 140 గ్రామాలను తాము దత్తత తీసుకున్నామని తెలిపారు. ఆయా గ్రామాల్లో మెడికల్ కేర్ బాధ్యతలు తాము నిర్వరిస్తున్నామని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీని సందర్శించి, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇలాంటి అధునాతన టెక్నాలజీ లేదని వ్యాఖ్యానించినట్లు తెలిపారు.