అండగా నిలవండి | CM Revanth Reddy appeal to PM Narendra Modi | Sakshi
Sakshi News home page

అండగా నిలవండి

Jun 12 2026 1:43 AM | Updated on Jun 12 2026 1:43 AM

CM Revanth Reddy appeal to PM Narendra Modi

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ సహా 6 మహానగరాలకు రూ. 6 లక్షల కోట్లతో ప్రత్యేక నిధి

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి.. వినతిపత్రం సమర్పణ

రూ. 38,595 కోట్లతో మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగం పంచుకోండి 

మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్‌ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టులకు సహకరించండి

‘ప్రాణహిత’ను ఆమోదించండి.. 

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో చర్చలకు చొరవ చూపండి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతోపాటు రాష్ట్రంలో చేపట్టనున్న కీలక ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన సీఎం రేవంత్‌.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు. వికసిత్‌ భారత్‌–2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.  

‘ఎం–6’ నిధికి రూ. 6 లక్షల కోట్లు 
తెలంగాణ రైజింగ్‌ దార్శనికతను ప్రధానికి వివరించిన రేవంత్‌రెడ్డి.. 2034 నాటికి వన్‌ ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. నీతి ఆయోగ్‌ 11వ పాలక మండలి సమావేశంలో తాను చేసిన ఎం–6 టాస్‌్కఫోర్స్‌ ప్రతిపాదనను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. దేశంలో ఆర్థిక వృద్ధికి ఇంజిన్లలా పనిచేస్తున్న ఆరు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల అభివృద్ధికి ప్రధాని నేతృత్వంలో ఈ టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 

మెట్రో రెండో దశకు చేయూతనివ్వండి 
రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లలో చేపట్టనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశకు కేంద్రం ఆమోదం తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానిని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌ (జేవీ) ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుతోపాటు సస్టెయినబుల్‌ అర్బన్‌ హబ్‌గా నిర్మిస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. 

రోడ్లు, రైల్వేల విస్తరణకు ఊతం 
హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌రోడ్డు (ఉత్తర, దక్షిణ కారిడార్లు), ప్రతిపాదిత హైదరాబాద్‌–అమరావతి–బందరు పోర్టు ఎక్స్‌ప్రెస్‌ వే, మన్ననూర్‌–శ్రీశైలం (ఎన్‌హెచ్‌–765) మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలిపి అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే రీజనల్‌ రింగ్‌రైల్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోపాటు శంషాబాద్‌లో సెంట్రల్‌ హైస్పీడ్‌ రైల్‌ హబ్‌ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరు, పుణే నగరాలతో అనుసంధానిస్తూ హైస్పీడ్‌ రైల్‌ కనెక్టివిటీని అభివద్ధి చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని.. ఇందుకోసం హైదరాబాద్‌ పరిధిలో 200 ఎకరాల వివాదరహిత భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 

టెక్నాలజీ, సాగునీటి ప్రాజెక్టులకు దన్నుగా నిలవండి 
టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో గమ్యస్థానంగా తెలంగాణ దూసుకుపోతోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0 కింద రాష్ట్రానికి ప్రాజెక్టులు కేటాయించాలని ప్రధానిని కోరారు. ఫ్యూచర్‌ సిటీలో ఎల్రక్టానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ 2.0) ఏర్పాటుకు గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌ కింద కేంద్రం మద్దతివ్వాలని కోరారు. సాగునీటి రంగంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేలా ప్రధాని చొరవ తీసుకోవాలని ప్రధానిని సీఎం కోరారు. 

విద్య, వైద్యమే పునాదిగా.. 
రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి ఈ భేటీలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దేశాభివృద్ధి వ్యూహంలో నాణ్యమైన విద్య, వైద్యం పునాదిగా ఉండాలని సీఎం నొక్కిచెప్పారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్, స్కిల్స్‌ యూనివర్సిటీ, టాటా టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో ఐటీఐల ఆధునీకరణ వంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను మోదీకి వివరించారు. 

మెట్రో రెండో దశకు సత్వరమే అనుమతులివ్వండి 
కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీలో సీఎం విజ్ఞప్తి 
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2 ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఖట్టర్‌తో సీఎం సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్‌–2 ఆవశ్యకతను ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. మెట్రో ఫేజ్‌–2 డీపీఆర్‌లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ గతంలో చేసిన సూచనల మేరకు మార్పులు చేసి ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి కూడా త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఎస్‌ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్, ప్రత్యేక కార్యదర్శి (సమన్వయం) అద్వైత్‌కుమార్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement