రిజిస్ట్రేషన్లు‌ పారదర్శకంగా జరగాలి

CM KCR Review On Non Agricultural Lands Registration - Sakshi

వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు–వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్‌అండ్‌బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ నియమించారు. (చదవండి: తెలంగాణలో కొలువుల జాతర)

ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు(కేటీఆర్‌), పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభ్యులుగా ఉంటారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమయి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. (చదవండి: 14 నెలల తర్వాత ప్రధానిని కలిసిన సీఎం)

వ్యవసాయేతర ఆస్తులు –వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీ రామారావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఓ కార్యదర్శులు శేషాద్రి, స్మిత సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మీ సేవా కమిషనర్ జిటి వెంకటేశ్వర్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.  ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగా జరుగుతుందని, రైతులు చాలా సులభంగా, సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలో కూడా అలాంటి విధానమే రావాలని సీఎం ఆకాంక్షించారు.

‘‘వివిధ కారణాల వల్ల 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయి. ఇంకా జాప్యం కావద్దు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతుంది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలి. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావద్దు. ప్రజలు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావద్దు. ఏ అధికారి కూడా తన విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వీలు ఉండవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తీసుకుని మంచి విధానం తీసుకురావాలి. మంత్రి వర్గ ఉపసంఘం అందరితో చర్చించాలి.

నగరాలు, పట్టణాల్లో ఎలాంటి సమస్యలున్నాయి? గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాటిని ఎలా పరిష్కరించాలి? ఇంకా మెరుగైన విధానం తీసుకురావాలంటే ఏమి చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి ’’ అని ముఖ్యమంత్రి కోరారు. ‘‘పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇండ్లు నిర్మించుకున్నారు. వారికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయి. అలాంటి ఆస్తులను అమ్మే, కొనే సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కూడా మార్గం కనిపెట్టాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top