
వెంకటాపురం(కె) మండలంనుంచి వాహనాల్లో బయలుదేరి వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ బలగాలు
కర్రిగుట్టల్లో ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ వేసిన కేంద్రం
సీఆర్‌పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కీలక స్థావరాల్లోకి దూసుకెళ్లి, గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఇప్పటివరకు పదుల సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టిన కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు ప్రస్తుతం వెనక్కి తగ్గాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో వేలాది మంది సాయుధ పోలీస్ బలగాలతో భారీ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ వేసింది. సీఆర్‌పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.
ఆదివారం సాయంత్రం (మే 11న)లోపు సరిహద్దు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కేంద్ర బలగాల వ్యూహాత్మక ఎత్తుగడా? లేక మావోయిస్టులు ఇప్పటికే చర్చలకు సిద్ధమని ప్రకటించడం, శాంతి చర్చల కోసం పౌరహక్కుల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేయడం, ఇందుకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం ‘కగార్’పై పునరాలోచనలో పడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అడవుల్లో అణువణువూ గాలిస్తూ..
దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సాయుధ, స్థానిక పోలీసు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో తెలంగాణ వైపు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు, ఛత్తీస్‌గఢ్ వైపు సుక్మా, బీజాపూర్ జిల్లాల్లోని కర్రిగుట్ట అడవులు మావోయిస్టులకు కీలక స్థావరంగా ఉన్నాయని గుర్తించాయి.
సీఆర్‌పీఎఫ్, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ కలిపి సుమారు 24 వేలమంది భద్రతా బలగాలు ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో వారంలో ఆ ప్రాంతంలో ఆపరేషన్ మొదలుపెట్టాయి. డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్లు, స్మోక్ బాంబులు, ఫ్లాష్ బాంబులను వినియోగిస్తూ లోనికి దూసుకెళ్లాయి. మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్‌లు, బీర్ బాటిల్ బాంబులు వంటి పేలుడు పదార్థాలను బాంబు స్క్వాడ్‌లు నిర్వీర్యం చేశాయి.
ఈ క్రమంలోనే కర్రిగుట్టల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్‌ఓబీ) ఏర్పాటుతో పాటు ఐదు బేస్ క్యాంపులను స్థాపించారు. మావోయిస్టుల సొరంగాలు, గుహలు ఉన్నట్టుగా గుర్తించాయి. ఏప్రిల్ 24 నుంచి మే 7 మధ్య సుమారు 30 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి.
కీలక నేతలు లక్ష్యంగా..
కర్రిగుట్టలు మావోయిస్టు కీలక నేత హిడ్మా ఆ«దీనంలోని మావోయిస్టు స్థావరాలకు కేంద్రంగా ఉన్నాయని భద్రతా బలగాలు గుర్తించాయి. హిడ్మాతో పాటు ఇతర మావోయిస్టు నాయకులైన గణపతి, బసవరాజు, ఆనంద్ వంటి వారిని కూడా ఈ ఆపరేషన్‌లో భాగంగా టార్గెట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. భద్రతాబలగాలు అధికారికంగా ఈ విషయాలు చెప్పనప్పటికీ ఆదే దిశగా ముమ్మరంగా ఆపరేషన్ చేపట్టాయి.
కానీ కర్రిగుట్టలపై మావోయిస్టులకు పూర్తి పట్టుండడంతో వారు కొన్ని సమయంల్లో బలగాల కంటే వేగంగా కదలగలిగారు. ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే శాంతి చర్చలు తెరపైకి వచ్చాయి. మరోవైపు మావోయిస్టులను ఏరివేయాలన్న లక్ష్యంతో ముమ్మర ఆపరేషన్లు చేపట్టినా ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం బలగాలను వెనక్కి రప్పించడానికి మరో కారణంగా చెబుతున్నారు.
మావోయిస్టుల వ్యూహం ఫలించిందా?
కేంద్ర సాయుధ బలగాలకు చిక్కకుండా మావోయిస్టు అగ్రనాయత్వం తప్పించుకుంటూ సేఫ్ షెల్టర్ జోన్లకు వెళ్లడంతో పాటు శాంతి చర్చల పేరిట మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కర్రిగుట్టల చుట్టూ ఐఈడీ బాంబులు అమర్చినట్టు ముందుగానే పెద్దయెత్తున ప్రకటనలు జారీ చేసిన మావోయిస్టు పార్టీ.. సాయుధ బలగాల ఆపరేషన్ మొదలైన కొద్ది రోజుల్లోనే శాంతి చర్చలకు సిద్ధమంటూ లేఖ విడుదల చేసింది.
ఇది రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకు, మావోయిస్టు అగ్ర నాయత్వం తప్పించుకునిషెల్టర్ జోన్లకు వెళ్లేందుకు, ప్రజల మద్దతు పొందేందుకు ఎంచుకున్న ఒక వ్యూహంగా చెబుతున్నారు. శాంతిచర్చలకు వీలుగా తాము ఆరు నెలలపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో విడుదల అయ్యింది.
మరోవైపు సీపీఎం, బీఆర్‌ఎస్, తెలంగాణ జన సమితి వంటి పార్టీలు, పౌర హక్కుల సంఘాలు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సైతం మావోయిస్టులతో చర్చలే ఉత్తమమన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనితో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఒత్తిడి సైతం కేంద్రం సాయుధ బలగాలను వెనక్కి రప్పించేలా చేసిందనే చర్చ జరుగుతోంది.