
హైదరాబాద్]: రోగుల భద్రత, ఆరోగ్య సంరక్షణలో కొత్త ఆవిష్కరణలు, వ్యవస్థల అభివృద్ధిని ప్రోత్సహించే ప్రపంచంలోని ప్రముఖమైన వేదికల్లో ఒకటైన అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ (International Health Dialogue - IHD) 2026 ఎడిషన్‌ను అపోలో హాస్పిటల్స్ నిర్వహించనుంది. ఈ సదస్సు 2026 జనవరి 30 మరియు 31 తేదీలలో హైదరాబాద్‌లో జరగనుంది. ఐహెచ్‌డీ 2026 థీమ్ 'గ్లోబల్ వాయిసెస్ వన్ విజన్’ ఈ థీమ్ ఒక ఉమ్మడి లక్ష్యం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
ఆ లక్ష్యం ఏంటంటే.. పటిష్టంగా, రోగి-కేంద్రీకృతంగా, సాంకేతికతతో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిర్మించడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ఆలోచనలు, ఆవిష్కరణలు, నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని ఈ సదస్సు భావిస్తోంది. ఈ కార్యక్రమం ప్రధానంగా మూడు కీలక అంశాలపై దృష్టి సారిస్తుంది. అవి: నాయకత్వంతో నడిచే భద్రతా నమూనాలు; మానవ-కేంద్రీకృత రూపకల్పన, డిజిటల్ పరివర్తన; అలాగే ఆసుపత్రి కార్యకలాపాలు, రోగి అనుభవం, చికిత్స ఫలితాలు వంటి అన్ని రంగాలలో అత్యుత్తమ ప్రమాణాలు సాధించే అంశాలపై సదస్సు దృష్టి పెడుతోంది.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీత రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ (IHD) ఒక శక్తివంతమైన ప్రపంచ వేదికగా మారింది. ఇక్కడ వైద్యులు (క్లినిషియన్లు), కొత్త ఆవిష్కరణలు చేసేవారు (ఇన్నోవేటర్లు), విధానాలు రూపొందించేవారు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచేవారు అంతా ఒకచోట చేరి, ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశం కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతుంది’ అని అన్నారు.