
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ జితేందర్. చిత్రంలో ఎస్‌ఐబీ చీఫ్ బి.సుమతి, లొంగిపోయిన మావోయిస్టు సుజాత
మావోయిస్టులు కాలయాపన కోసం వేసే ఎత్తుగడ అది
మావోల విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఒకటే
అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలని పిలుపు
డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో చర్చలు జరపడం వల్ల ఫలితం ఏమీ ఉండదని డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు. ‘2004లోనూ మావోయిస్టులతో జరిపిన చర్చల సందర్భంగా ఫలితమేమీ రాలేదు. చర్చలు అనేది మావోయిస్టులు తమను తాము కాపాడుకునేందుకు, కాలయాపన చేసేందుకు వేసే ఒక ఎత్తుగడ మాత్రమే’అని ఆయన పేర్కొన్నారు. చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు చేస్తున్న ప్రకటనలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు డీజీపీ ఈ విధంగా స్పందించారు.
మావోయిస్టుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లొంగిపోవడమే మావోయిస్టులకు ఉత్తమ మార్గమని తెలిపారు. మార్చి 31, 2026 వరకు మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలన్నది అంతిమ లక్ష్యమని.. అది లొంగుబాట్లు కావచ్చు, లేదా ఎన్‌కౌంటర్ ద్వారా కావొచ్చు.. అని పేర్కొన్నారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులకు డీజీపీ విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి, అలియాస్ కల్పన అలియాస్ సుజాతక్క శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ చీఫ్ బి.సుమతిలతో కలసి డీజీపీ జితేందర్ మాట్లాడారు. ఈ ఏడాది ఇప్పటివరకు మావోయిస్టు పార్టీకి చెందిన 404 మంది సభ్యులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని, తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 10 మంది మృతి చెందారని తెలిపారు.
నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు పార్టీ నాయకుడు ఎవరన్నది తెలియదని, పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టుల విషయంలో ప్రభుత్వం సానుభూతితోనే వ్యహరిస్తుందని వెల్లడించారు. ఆరోగ్యపరమైన సమస్యలకు చికిత్సతోపాటు రివార్డు మొత్తాన్ని ఇస్తామని తెలిపారు. మావోయిస్టులలో తెలంగాణకు చెందిన 78 మంది దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర కమిటీలో 11 మంది తెలంగాణ వాళ్లు ఉన్నారన్నారు.
43 ఏళ్ల అజ్ఞాతం వీడిన సుజాత..
తొలుత జననాట్యమండలిలో చేరిన పోతుల పద్మావతి, అలియాస్ సుజాత 43 ఏళ్ల అజ్ఞాత జీవితంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలి స్థాయి వరకు చేరారు. గద్వాల జిల్లా గట్టు మండలంలోని పెంచికలపాడు గ్రామానికి చెందిన ఆమె మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీని 1984లో వివాహం చేసుకున్నారు. 1989 వరకు పెరిమిలి దళంలో, తర్వాత ఎటపల్లి దళంలో పనిచేసిన సుజాత 1996లో ఉత్తర గడ్చిరోలి దేవూరి దళ కమాండర్‌గా, 1997–99 వరకు దక్షిణ బస్తర్ కమిటీ డివిజన్ కమిటీ మెంబర్‌గా, 2001లో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
2018లో జనతన్ సర్కార్ పూర్తి బాధ్యతలు స్వీకరించారు. 2022లో గెరిల్లా స్థావరం దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో కార్యదర్శిగా, 2023లో కేంద్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. కోయ భాషలో వచ్చే పేతురి పత్రిక సంపాదకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం సుజాత ఆరోగ్యం క్షీణించడంతో రాష్ట్ర డీజీపీ సమక్షంలో శనివారం లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్.. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ చీఫ్ సుమతితో కలసి సుజాతకు రూ.25 లక్షల రివార్డు చెక్కును అందించారు.