పిల్లి దేవత.. వాహనమూ మార్జాలమే..! ఆ ఊరు పేరు కూడా..

Cat Are Worshipped As God Rare Temple In Wanaparthy District - Sakshi

వనపర్తి జిల్లాలో అరుదైన ఆలయం

సాక్షి, హైదరాబాద్‌: పిల్లి అపశకునమనే భావన చాలామందిలో ఉంటుంది. పురాణాల్లోనూ పిల్లిని శుభసూచకంగా చూపిన దాఖలాలు లేవు. కానీ ఓ ఊళ్లో మాత్రం పిల్లినే దేవతగా పూజిస్తున్నారు. ఆ శివాలయంలో మార్జాలమాత ప్రత్యేక స్థానంలో కనిపిస్తోంది. ఆ దేవత వాహనం కూడా మార్జాలమే. విచిత్రమేంటంటే ఆ ఊరు పేరు కూడా ఈ పిల్లితో పుట్టిందే. 

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని బెక్కం.. శ్రీశైలం ముంపు గ్రామం. నేలబిల్కు, పెద్ద బిల్కులనే రెండు చిన్నగ్రామాలు కలిపి బెక్కంగా ఏర్పడింది. ఈ ఊళ్లో ఓ శివాలయం ఉంది. స్వామిని ‘బెక్కేశ్వరుడు’గా కొలుస్తున్నారు. ఈ గుడి గోడ గూటిలో ఓ పెద్ద శిల్పం ఉంది. పైన కుడి చేతితో తామరపుష్పాన్ని ధరించి, ఉత్కుటాసన భంగిమలో అమ్మవారి రూపం (పార్వతి?) ఉంది.

ఆ శిల్పం దిగువన మార్జాల ముఖం, మానవ శరీరాకృతితో, మార్జాల వాహనధారిౖయె అర్ధ పద్మాసనంలో ఉన్న మరో అమ్మవారి రూపం ఉంది. పిల్లి ముఖం కలిగి ఉండటం, పిల్లి వాహనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలయంలోని ఈ ప్రత్యేకతను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్యాంసుందర్, చంద్రశేఖర్‌ సోదరులు గుర్తించారని ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. 

పిల్లి పేరుతోనే ఊరు
‘పూర్వం ఆ గ్రామంలోని తాటివనంలో ఓ పుట్ట మీద ఆవు పాలు కురిపిస్తుంటే ఓ పిల్లి తాగుతూ ఉండేదని, దాన్ని గుర్తించి స్థానికులు అక్కడి పుట్టను తవ్వగా శివలింగం వెలుగుచూసిందని గాథ అక్కడ ప్రచారంలో ఉంది. కన్నడంలో పిల్లిని బెక్కగా పిలుస్తారు. ఆ పిల్లి పేరుమీ­దుగానే ఆ శివుడికి బెక్కేశ్వరుడని, గ్రామానికి బెక్కం అని పేరు పెట్టారన్నది స్థానికుల కథనం.

ఈ ఆలయానికి 1065 జూలై11న కేతరస, రాజరసలనేవారు త్రైలోక్యమల్ల 1వ సోమేశ్వరుడి పాలన కాలంలో భూదానం చేసినట్టు శాసనం కూడా బయటపడింది. రాష్ట్రకూట శైలిలో నిర్మించిన ఇక్కడి త్రికూటాలయంలో లలాటబింబంగా గజలక్ష్మి ఉంది. ఓ గర్భాలయంలో ఛత్రాపరితల సమలింగం ఉండగా, ప్రతి గర్భాలయానికి ఎదురుగా వేర్వేరు కాలాలకు చెందిన నంది శిల్పాలున్నాయి.’ అని హరగోపాల్‌ పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top