11 ఎకరాల హక్కుపై పిటిషనర్లకు తేల్చిచెప్పిన హైకోర్టు
ఈ వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్‌కు ఆదేశం
తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం భూముల వేలాన్ని అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వేలానికి సంబంధించి బిడ్‌లు ఇప్పటివరకు అందలేదని, వేలం ప్రక్రియను కొద్ది రోజులు వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరగా, తిరస్కరించింది. భూ సంస్కరణల ట్రిబ్యునల్ (ఎల్‌ఆర్‌టీ) ముందు ఎలాంటి విచారణ లేదా పునర్వి చారణ ప్రక్రియ పెండింగ్‌లో లేనప్పుడు.. మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపలేమని తేల్చిచెప్పింది. సర్వే నంబర్ 83లో 11.12 ఎకరాల భూ వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.
రాయదుర్గం సర్వే నంబర్ 83/1, 83/పార్ట్‌లో తమకు చెందిన 11.12 ఎకరాల భూమిపై అధికారులు బుల్డోజర్లతో సరిహద్దులను చెరిపివేసి జోక్యం చేసుకుంటున్నారని హైదరాబాద్‌కు చెందిన రమాదేవితోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ భూమిలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, ఈ నెల 21, 28న నిర్వహించనున్న ఈ వేలాన్ని ఆపాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
⇒ ప్రభుత్వం, టీఎస్‌ఐఐసీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు చెబుతున్న భూమి 53 ఎకరాల్లో భాగమా లేక ప్రభుత్వ మిగులు భూమినా అన్నది సర్వే చేసి నిర్ధారించాలి. పిటిషనర్లు హక్కును కోరితే.. సివిల్ కోర్టును ఆశ్రయించాలి. ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దు’అని వాదించారు.
⇒ పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జే.రామచంద్రారావు వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వివాదం తిరిగి ఎల్‌ఆర్‌టీ పరిధిలోకి వెళ్లింది. అయితే, వేలానికి ఇంకా ఎలాంటి బిడ్‌లు రానందున వారం రోజులపాటు నిలిపివేయాలి’అని కోరారు.
⇒ వాదనలు విన్న న్యాయమూర్తి.. గతేడాది మే 7న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎల్‌ఆర్‌టీ ముందు పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. ఎల్‌ఆర్‌టీ ముందు ప్రస్తుతం ఏదైనా నిర్దిష్ట ప్రొసీడింగ్ పెండింగ్‌లో ఉందా? నోటీసులు జారీ అయ్యాయా? అనే అంశాలపై పిటిషనర్ల నుంచి స్పష్టత కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.


