ఒక్కటైనా కట్టారా? | BRS Working President KTR On CM Revanth Govt for double bedroom houses | Sakshi
Sakshi News home page

ఒక్కటైనా కట్టారా?

May 26 2026 1:33 AM | Updated on May 26 2026 1:33 AM

BRS Working President KTR On CM Revanth Govt for double bedroom houses

కూకట్‌పల్లి (హైదరాబాద్‌): అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా..హైదరాబాద్‌ నగరానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ పరిపాలన గురించి అవగాహన ఉంది కాబట్టే నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అనేక ఫ్లై ఓవర్లు మొదలుకుని టిమ్స్‌ ఆసుపత్రి దాకా ప్రతి ఒక్కటీ తామే నిర్మించామని, ప్రస్తుతం వాటికే సీఎం రేవంత్‌రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేస్తూ తామే నిర్మించామని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మించినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌ విసిరారు. సోమవారం కూకట్‌పల్లిలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కాంగ్రెస్‌ మోసం చేసింది.. 
‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం. తెలంగాణకు 24 గంటల కరెంటు, తాగునీటిని అందించింది కేసీఆరే. కానీ అసెంబ్లీ ఎన్నిలప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రతి వర్గాన్ని మోసం చేసింది. ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా దెబ్బతింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్‌ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయింది. బీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ, సెంట్రింగ్‌ కార్మికుల కోసం బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. నగరంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటిని సరఫరా చేస్తాం. ఈ బాధ్యత నేనే తీసుకుంటా..’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.  

దొంగ ఓట్లపై జాగ్రత్తగా ఉండాలి 
‘ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పారీ్టకి అండగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికీ తగిన అవకాశం, గౌరవం కల్పిస్తాం. ‘సర్‌’విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో నమోదు చేసిన దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్‌ విధానంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ తరఫున కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ‘సర్‌’పై కార్యకర్తలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement