
రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు నిరసనగా కీలక నిర్ణయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్న ఎంపీ సురేశ్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల సమస్యలు, ముఖ్యంగా యూరియా కొరతను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ, నిరసన రూపంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.
పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించిన మీదటే మంగళవారం జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ‘యూరియా సమస్యను పరిష్కరించాలని మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పలుమార్లు కోరాం. కానీ, రెండు ప్రభుత్వా లూ రైతుల గోడును పట్టించుకోకుండా పూర్తిగా విఫలమయ్యాయి. ప్రభుత్వాల ఈ రైతు వ్యతిరేక వైఖరికి నిరసన తెలిపేందుకే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాం’అని సురేశ్‌రెడ్డి చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్‌పై నోటాకు అవకాశం లేనందున, తమ నిరసనను తెలిపేందుకు ఎన్నికకు దూరంగా ఉండటమే సరైన మార్గమని భావించామన్నారు.
అభ్యర్థులను గౌరవిస్తాం...కానీ రైతుల సమస్యే ముఖ్యం
‘పోటీలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిలను మేము గౌరవిస్తాం. సుదర్శన్‌రెడ్డి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అయినా, రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్న ప్రస్తుత తరుణంలో మా నిరసనను బలంగా వినిపించడమే మా కర్తవ్యం’అని సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తోందని, ఇలాంటి పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.