కాంగ్రెస్ హామీల అమలు వైఫల్యంపై నిరంతర రాజకీయ దాడి
కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు వెళ్లకుండా ప్రత్యేక ప్రణాళిక
సంస్థాగతంగా పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ షురూ
‘సర్’పై అవగాహన పేరిట గ్రేటర్ ఎన్నికలపై స్పెషల్ నజర్
‘జెన్ జీ’ని చేరుకోవడం లక్ష్యంగా ప్రత్యేకంగా ముఖాముఖీలు
అసెంబ్లీ ఎన్నికల దిశగా క్షేత్ర స్థాయిలో జోరు పెంచే యోచన
వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర.. కేసీఆర్ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న రాజకీయ పోరుకు మరింత పదును పెట్టేందుకు బీఆర్‌ఎస్ సన్నద్ధమైంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలనలో అవినీతి, అధికార పార్టీ నేతల అక్రమాలపై ఆరోపణలను ప్రధాన అ్రస్తాలుగా మలుచుకోవాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన కార్మికుల మద్దతు కూడగట్టేలా ప్రభుత్వాన్ని నిరంతరం ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే కసరత్తు ప్రారంభించింది.
అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ వైపు మళ్లకుండా రాజకీయంగా అడ్డుకట్ట వేసే వ్యూహం కూడా అవసరమని భావిస్తోంది. యువతను ఆకర్షించే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగంలో చురుకుదనం పెంచడం, భవిష్యత్‌లో కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్రల వంటి భారీ ప్రజా కార్యక్రమాలతో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచేందుకు బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
హామీల అమలుపై నిరంతర ఒత్తిడి
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే వరంగల్‌లో రైతు సదస్సు నిర్వహించిన బీఆర్‌ఎస్ త్వరలో తెలంగాణ భవన్‌లో యువజన, విద్యార్థి నేతలతో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతుభరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు హామీలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతర రాజకీయ ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నిర్ణయించింది.
అక్రమాలు, అవినీతి ఆరోపణలను ప్రజల ముందుంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రజల్లో నిరంతరం చర్చ జరిగేలా చూడాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావులతోపాటు పార్టీ ముఖ్య నేతలు రేవంత్ ప్రభుత్వంపై రోజుకో ఆరోపణ, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికే అసెంబ్లీతోపాటు ప్రజా వేదికలు, సామాజిక మాధ్యమాలు, జిల్లా స్థాయిలో కార్యక్రమాల ద్వారా ఈ అంశాలను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
సంస్థాగత బలోపేతమే ప్రధాన లక్ష్యం
సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, క్రియాశీల కార్యకర్తల గుర్తింపు, యువ నాయకత్వానికి ప్రాధాన్యం వంటి అంశాలపై కార్యాచరణ ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఇప్పటి నుంచే బూత్ స్థాయి నుంచే పార్టీ వ్యవస్థను పటిష్టం చేసే పనులు ప్రారంభమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గ్రేటర్‌పై ఫోకస్.. యువతను చేరుకునే ప్రయత్నం
గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కూడా బీఆర్‌ఎస్ అత్యంత కీలకంగా చూస్తోంది. ‘సర్’పై అవగాహన కార్యక్రమాల పేరిట నగర ఓటర్లతో మరింత సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని పార్టీ యోచిస్తోంది. సర్‌పై కేటీఆర్ గ్రేటర్ పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిజిటల్ యుగంలో కీలకంగా మారుతున్న ‘జెన్ జీ’యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక ముఖాముఖి సమావేశాలు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించే ప్రణాళికను సిద్ధం చేస్తోంది.


