
జూబ్లీహిల్స్ యుద్ధానికి ప్రధాన పార్టీలు సన్నద్ధం
అభ్యర్థిని ప్రకటించి ముందంజలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ
త్వరలోనే తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్, బీజేపీ కసరత్తు
ఎంఐఎం తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రసవత్తర రాజకీయ పోరుకు తెరలేచింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు దీనిపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండేందుకే ఎక్కువ అవకాశం ఉంది. సిట్టింగ్ పార్టీ బీఆర్‌ఎస్, అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ బరిలో ఉండే అవకాశాలున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక, ఎంఐఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ లెక్కలు మారతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కంటోన్మెంట్‌ను కైవసం చేసుకున్నట్టే..
అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. ఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యరి్థని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ యాదవ్‌ల పేర్లను పరిశీలిస్తోంది. అయి తే ఏఐసీసీకి పంపిన జాబితాలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు ఉండటం గమనార్హం.
రేసులో ‘కారు’జోరు
నియోజకవర్గంలో ఉన్న పార్టీ సంస్థాగత బలంతో పాటు, మాగంటి గోపీనాథ్ కుటు ంబంపై ఉన్న సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న ఎంతో కొంత వ్యతిరేకత సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేలా చేస్తుందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ఇప్పటికే ఖరారు చేయడం ద్వారా మిగిలిన పక్షాల కంటే ముందంజలో ఉంది.
పార్టీ సీనియర్ నేతలతో పలు దఫాలుగా భేటీ అయిన కేసీఆర్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. తాజాగా షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కీలక భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుమారు నెల రోజుల నుంచే పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసే పనిలో ఉన్నా రు. ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసే ందుకు ఆరు డివిజన్లకు పార్టీ ఇన్‌చార్జిలను ఇప్పటికే నియమించారు.
హైదరాబాద్‌లో సత్తా చాటేందుకు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో సత్తా చాటేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని, హిందూత్వ ఎజెండాతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్‌ఎస్ బలహీనతలను ఆసరాగా చేసుకుని జూబ్లీహిల్స్‌పై కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఆశపడుతున్నారు. ఈ పార్టీ టికెట్ కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకెల దీపక్‌రెడ్డితో పాటు, అట్లూరి రామకృష్ణ, జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, బండా రు విజయలక్ష్మీ, సినీనటి జయసుధ, ఆకుల విజయ పోటీ పడుతున్నారు.
ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యరి్థని ప్రకటించనున్నట్టు సమాచారం. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండడంతో ఈ ఎన్నిక ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంఐఎం కార్యాచరణపై మాత్రం ఇంతవరకు స్పష్టత రావడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమైన మజ్లిస్ ఈసారి ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీపీఐ, సీపీఎం, జనసమితిలు అధికార కాంగ్రెస్ వైపే నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.