జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అనర్హుడిగా ప్రకటించాలి
ఎన్నికల ప్రధాన అధికారికి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించడంతో పాటు, సుమోటోగా కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు.
సీఎం రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ కార్మికుల ఓట్లకోసం సన్మానాల పేరిట కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు అనంతరం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఆధారాలను ఎన్నికల కమిషన్‌కు అందజేశాం.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్‌ను తొలగించడంతో పాటు కేంద్ర పోలీసు బలగాలను మోహరించాలని కోరాం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఇచి్చన ఫిర్యాదులో కోరాం. తనకు అడ్డువస్తే చంపేస్తానని నవీన్ యాదవ్ బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు’అని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై బీఆర్‌ఎస్ లీగల్ సెల్ బృందం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది.


