పదేళ్ల తర్వాత అమ్మ ఒడికి

A Boy Return To Home After Ten Years - Sakshi

ఏడేళ్ల వయసులో మధ్యప్రదేశ్‌లో తప్పిపోయిన శ్రీవాత్సవ

బెంగాల్‌లో ఉన్నాడని గుర్తించి ఇంటికి చేర్చిన తెలంగాణ పోలీసులు

సాక్షి,హైదరాబాద్:‌ మానసిక స్థితి సరిగాలేని ఓ బాలుడు ఏడేళ్ల వయసులో ఇంటి నుంచి తప్పిపోయాడు. ఆ బాలుడిని పోలీసులు చేరదీసి చిల్ర్డన్స్‌ హోమ్‌కు పంపారు. పదేళ్లు అక్కడే గడిపిన ఆ బాలుడు తెలంగాణ పోలీసుల సాయంతో అమ్మ ఒడికి చేరాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా కొత్వాలీకి చెందిన శ్రీవాత్సవకు చిన్నతనంలో మానసిక సమస్యలున్నాయి. 2010 అక్టోబర్‌ 10న ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. అదే నెల 21న పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ పోలీసులు అతన్ని చేరదీశారు. అనంతరం హౌరాలోని చిల్ర్డన్స్‌ హోమ్‌కు పంపారు. 

గుర్తించిన ‘దర్పణ్‌’
ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో ‘దర్పణ్‌’ యాప్‌ ను తెలంగాణ సేఫ్టీ వింగ్‌ అభివృద్ధి చేశారు. తప్పిపోయిన, ఆశ్రమాల్లో ఉన్న పిల్లల ఫొటోలను దీంతో పోల్చిచూస్తారు. శ్రీవాత్సవ చిన్ననాటి ఫొటోతో హౌరాలోని చిల్ర్డన్స్‌ హోమ్‌లో ఉన్న బాలుడి ముఖకవళికలు ఒకేలా ఉన్నాయని యాప్‌ గుర్తించింది. సేఫ్టీ వింగ్‌ పోలీసులు శ్రీవాత్సవ తల్లిదండ్రులు, హుగ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిల్ర్డన్స్‌ హోమ్‌లో ఉన్న శ్రీవాత్సవను అతని తండ్రికి అధికారులు అప్పగించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top