మూసీ పేరుతో కాంగ్రెస్‌ దోపిడీ | BJP Chief Ramchander Rao Fires On Congress Govt over Musi River | Sakshi
Sakshi News home page

మూసీ పేరుతో కాంగ్రెస్‌ దోపిడీ

Mar 23 2026 4:35 AM | Updated on Mar 23 2026 4:35 AM

BJP Chief Ramchander Rao Fires On Congress Govt over Musi River

మూసీనదిపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

కూల్చడం, నాశనం చేయడమే ఆ పార్టీ డీఎన్‌ఏ

పేదల ఇళ్లు కూల్చేసి పునరుజ్జీవం అంటే ఊరుకోం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం పేరుతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. లక్ష కోట్లు దోచుకుందని.. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ పేరుతో దోపిడీకి తెగబడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు ఆరోపించారు. దీనివల్ల చివరకు తెలంగాణ మూసేసే పరిస్థితికి చేరుతుందని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవంపై ఆదివారం ఓ హోటల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో రాంచందర్‌రావు మాట్లాడుతూ పెన్షన్లకు, ఉద్యోగుల జీతాలకు, రైతు భరోసాకు, ప్రభుత్వాన్ని నడిపేందుకు పైసల్లేవంటూ నిత్యం మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మూసీ ప్రక్షాళనకు మాత్రం రూ. లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. అప్పు చేసి సొమ్ము తీసుకొచ్చి, ఆ అప్పు భారాన్ని సామాన్యులపై వేస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు.

55 కి.మీ. మూసీ సుందరీకరణకు ముందుగా రూ. 5 వేల కోట్లు వ్యయం అవుతుందని చెప్పి తీరా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) ప్రజెంటేషన్‌ రోజున రూ. 7 వేల కోట్లు అవుతుందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని వృథా చేసే పనులను బీజేపీ అడ్డుకుంటుందని రాంచందర్‌రావు చెప్పారు. డీపీఆర్‌ ప్రకటన రోజున 10 వేల ఇళ్లు స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని సీఎం వివరించారని.. కానీ అసెంబ్లీలో మాత్రం కేవలం 1,400 ఇళ్లను కూల్చాల్సి వస్తుందని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కూల్చడం, నాశనం చేయడమే కాంగ్రెస్‌ డీఎన్‌ఏ అని దుయ్యబట్టారు.

50 మీటర్ల వరకూ మూసీ బఫర్‌ అని నిర్ధారించిన ప్రభుత్వానికి.. నార్సింగి వద్ద మూసీలోనే కడుతున్న బహుళ అంతస్తుల భవనం కనిపించడం లేదా అంటూ విమర్శించారు. పేదల ఇళ్లు, స్థలాలను బలవంతంగా లాక్కొని, వాటి మీద గాంధీ విగ్రహం పెడతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. పేదలకు ముందుగా పునరావాసం కల్పించాకే మూసీ ప్రక్షాళనకు సిద్ధం కావాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మహారాష్ట్ర వాటర్‌ పాలసీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అడ్వైజర్‌ శ్రీరాం వెదిరె పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మూసీ పునరుజ్జీవంపై ప్రసంగించారు.  

Advertisement
 
Advertisement
Advertisement