
హైకమాండ్‌తో కీచులాట
నేరుగా విమర్శనాస్త్రాలు
రాజీనామాను ఆమోదించిన అధిష్టానం
సిటీలో ఒకే ఒక బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, సిటీబ్యూరో/అబిడ్స్: బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శకం ముగిసింది. ఆయన రాజీనామాను ఆ పార్టీ అధిష్టానం ఆమోదించింది. అధిష్టానంపై తనదైన శైలిలో విమర్శనా్రస్తాలను సంధించడంతో కొంత కాలంగా కంటిలో నలుసులా తయారయ్యారని సొంత పార్టీ నేతలు భావించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని వ్యతిరేకిస్తూ వచి్చన ఎమ్మెల్యే తాజాగా నూతన అధ్యక్షుడి ఎన్నికనూ విడిచిపెట్టలేదు. రాంచందర్‌రావుపైనా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం దిగి వస్తుంది, బుజ్జగిస్తుందని భావించిన రాజాసింగ్‌కు నేతలు షాకిచ్చారు. ఆయన రాజీనామాను అధిష్టానం ఆమోదించారు. దీంతో జీహెచ్‌ఎంసీలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ దూరమవడంతో ఆ పారీ్టకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
హిందుత్వంతో దూకుడు..
రాజాసింగ్ హిందుత్వ వాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన పెట్టింది పేరు. దూకుడుగా ప్రవర్తించి కొన్ని సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకోవడం అలవాటుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌ను ఏడాదికిపైగా బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఎన్నికల ముందు పారీ్టలోకి తీసుకుని, టికెట్ ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని వ్యతిరేకించిన రాజాసింగ్.. పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా కనిపించింది లేదు. రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసినా కొంత వరకు ఓపికపడుతూ వచ్చారు. ఆ మధ్య ఎంపీ బండి సంజయ్ వచ్చి సముదాయించిన తర్వాత కాస్త తగ్గిన రాజాసింగ్.. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావును ప్రకటించడంతో మరోసారి నోటికి పని చెప్పారు. ఈ సమయంలో పార్టీ అగ్రనాయకులను సైతం విడిచిపెట్టలేదు. దీంతో రాజాసింగ్ వ్యవహారాన్ని పార్టీ సీనియర్‌గా తీసుకుంది. ఆయన రాజీనామా చేసినా గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లలో ఏ ఒక్కరూ ఆయన వెంటరాలేదు.

భవిష్యత్ ప్రయాణం ఎటు?
పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో తదుపరి రాజాసింగ్ దారి ఎటు అని చర్చ సాగుతోంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్ వరుసగా మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు బీజేపీకి దూరం కావడంతో ఆయన మద్దతుదారులు, కొంతమంది అనుచరులు మాత్రం ఆయన శివసేన పారీ్టలో చేరుతారని చెబుతున్నారు. మరో వైపు హిందూ ఎజెండాపై కొత్త పార్టీ పెడతారనే వాదనలు వినిపిస్తున్నాయి.