
బైక్ ట్యాక్సీలను కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం
ఇప్పటికే అనేక ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్‌గా
అవసరమైన స్థాయిలో లేని కంపెనీల పర్యవేక్షణ
తీరు మారకుంటే ప్రయాణికుల భద్రత గాల్లో దీపమే
సాక్షి,హైదరాబాద్: క్యాబ్‌ల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీలను కొసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోటారు వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025ని విడుదల చేసింది. బైక్ ట్యాక్సీలు వైట్ నెంబర్ ప్లేట్‌పై పని చేసేందుకు అనుమతి ఇచి్చంది. అయితే ఈ సేవలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అనుమతుల విధానం, నియంత్రణ లేదు. కేవలం ఆయా సంస్థల యాప్‌ల ఆధారంగా ఇవి పని చేస్తున్నాయి. బైక్ ట్యాక్సీలను అవసరమైన స్థాయిలో నిర్వాహకులు పర్యవేక్షించలేకపోతున్నారు. ఈ విధానంలో లోపాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులో ప్రయాణికుల భద్రతకు పెను సవాల్ ఎదురుకానుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎలాంటి ‘ప్రత్యేకతలు’ అవసరం లేదు...
రాజధానిలో ఆటోలు , ట్యాక్సీలు నడపాలంటే ఆ డ్రైవర్లకు ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు బ్యాడ్జ్ తప్పనిసరి. సదరు వాహనాలకు సైతం కచ్చితంగా ఎల్లో నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. బైక్ ట్యాక్సీల విషయంలో ఇలాంటి నిబంధనలు ఏవీ ప్రస్తుతం అమలులో లేవు. వైట్ నెంబర్ ప్లేట్లతోనే, సాధారణ డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన వారే ఆయా సంస్థల వద్ద యాప్స్ ద్వారా రిజిస్టర్ చేసుకుని బైక్ ట్యాక్సీలు నడిపేస్తున్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సైతం క్యాబ్‌ల మాదిరిగా... ఏది బైక్ ట్యాక్సీనో, ఏది సొంత బైకో గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం వైట్ ప్లేట్‌కు ఓకే చెప్పేయడం గమనార్హం.
ప్రయాణికుడి భద్రత ఎవరి బాధ్యత?
బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. మోటారు వాహనాల చట్టం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో దీనిని కచి్చతంగా అమలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సైబరాబాద్‌లోనూ తప్పనిసరి చేశారు. వాణిజ్య సేవలు అందించేటప్పుడు పిలియన్ రైడర్ బాధ్యత బైక్ రైడర్‌దే అవుతుంది. దీని ప్రకారం చూస్తే బైక్ ట్యాక్సీ డ్రైవర్ వద్ద కచి్చతంగా రెండు హెల్మెట్లు ఉండాలి. ఒకటి తాను ధరించి రెండోది రైడ్ బుక్ చేసుకున్న ప్రయాణికుడికి అందించాలి. అయితే ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్లలో ఒక హెల్మెట్ మాత్రమే కనిపిస్తుంటుంది. రెండు హెల్మెట్లు కలిగి ఉండాలంటూ ఈ డ్రైవర్లకు రిజి్రస్టేషన్ చేసే సంస్థలు చెబుతున్నా అమలు కావడం లేదు. కొన్ని సంస్థలు అందించినవి సైతం డ్రైవర్లు తమ వెంట తీసుకురావట్లేదు.
పత్తాలేని పని గంటల విధానం...
కిరాయికి ప్రయాణికుల్ని చేరవేస్తూ సంచరించే బైక్ ట్యాక్సీలు సైతం కమర్షియల్ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఈ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు కావాల్సిందే. వీటి డ్రైవర్లు రోజుకు గరిష్టంగా పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ విధులు నిర్వర్తించే కనీస కాలం ఎనిమిది గంటల్లో కచి్చతంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అయితే బైక్ ట్యాక్సీ నిర్వాహక సంస్థలు పక్కాగా ఇన్ని ట్రిప్పులు వేయాలంటూ డ్రైవర్లకు పరోక్షంగా టార్గెట్లు విధిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దీంతో ఒక్కో డ్రైవర్ కనిష్టంగా 15 గంటల నుంచి గరిష్టంగా 18 గంటల వరకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ టార్గెట్లను తట్టకోలేక కొందరు డ్రైవర్లు ఈ పని మానుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.
అక్కడో నెంబరు... ఇక్కడో నెంబరు...
బైక్ ట్యాక్సీల నిర్వహణ సంస్థలు భద్రత ప్రమాణాల్లో భాగంగా తమ డ్రైవర్ల రిజి్రస్టేషన్‌ను (ఎటాచ్‌మెంట్) పక్కా చేశాయి. ఇలా చేసుకున్న వారి వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉంటాయి. యాప్స్‌ను వినియోగించి బైక్ ట్యాక్సీని బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి తాను ఎక్కబోతున్న వాహనం డ్రైవర్ పేరు, నెంబర్‌తో పాటు అతడి రేటింగ్ సైతం కనిపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడకు ప్రయాణం చేసినా భద్రంగా గమ్యం చేర్చడానికి ఈ ఏర్పాటు ఉంది. అయితే ఇటీవల కాలంలో నగరంలో బైక్ ట్యాక్సీలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకరు ఉంటే... వాటిని డ్రైవింగ్ చేస్తూ వస్తున్న వారు మరొకరు ఉంటున్నారు. దీన్ని కనిపెట్టడానికి అనువైన క్రాస్ చెకింగ్ మెకానిజం నిర్వాహకుల వద్ద ఉండట్లేదు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు ఆర్టీఏ అధికారులు... వీరిలో ఎవరికీ ఈ విషయాలు పట్టట్లేదు.