సిటీతో పాటు మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఖరారు
జూబ్లీహిల్స్ వార్‌లో సూపర్ ఓవర్‌గా మాజీ క్రికెటర్
ముస్లింల ఓట్ల కోసం మరో పాచిక
నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం
రేపు కేబినెట్ విస్తరణలో ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న వేళ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మెజారిటీగా ఉన్న మైనారిటీ ఓట్లను తన ఖాతాలో జమ చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది. సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ను కేబినెట్ బెర్త్‌లోకి తీసుకోవాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తద్వారా ఉప ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి కెపె్టన్సీలోని మంత్రివర్గ టీంలో అజహరుద్దీన్ చేరనున్నారు. శుక్రవారం విస్తరించనున్న తెలంగాణ కేబినెట్‌లో అజారుద్దీన్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
ఇప్పటికే ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ విస్తరణకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా.. ముస్లిం మైనారిటీని ఒక మంత్రి పదవి దక్కేది. ఈసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్లిం మైనారిటీలు ఎన్నికల్లో గెలవకపోవడంతో ఆ వర్గానికి కేబినెట్‌లో అవకాశం లేకుండా పోయింది. అయితే.. ఏదో విధంగా మంత్రివర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి కూడా స్థానం కలి్పంచాలని కాంగ్రెస్ అధిష్టానం యోచించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్ల కోసం పాచికగా అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
ఉప ఎన్నికల బరి నుంచి తప్పించి..
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజహరుద్దీన్ ఓటమి పాలయ్యారు. అనంతరం.. బీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక్కడి నుంచే అజహర్ మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా ఆయనను బరి నుంచి తప్పించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినప్పటికీ.. అది ఇంకా ఆమోదం పొందలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తి కాకపోయినప్పటికీ అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
అన్ని విధాలా అనుకూలంగా మల్చుకునేందుకు..
అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వార్‌లో అజహర్‌ను సూపర్ ఓవర్ కోసం రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇది రెండో ఉప ఎన్నిక కావడంతోపాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఏకంగా నోటిఫికేషన్ కంటే రెండు నెలల ముందు నుంచే ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్‌న్‌చైర్మన్లను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తోంది. మరోవైపు సీనియర్లు పోటీ పడినప్పటికీ.. వారిని కాదని, యువనేత నవీన్ యాదవ్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసి బీసీ కార్డు ప్రయోగిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 24 శాతం మైనారిటీ ఓట్లు ఉండగా.. ఆ వర్గం ఓటు బ్యాంక్‌ను సైతం అనుకూలంగా మల్చుకునేందుకు అజహర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. అలాగే.. నగరం నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కలి్పంచినట్లు అవుతుందని
కాంగ్రెస్ భావిస్తోంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దక్కని పక్షంలో..
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో అజాహరుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మంత్రి వర్గంలో మరో ముగ్గురికి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఒకవేళ గవర్నర్ కోటాలో అజహరుద్దీన్‌కు అవకాశం దక్కని పక్షంలో.. త్వరలో ఖాళీ కానున్న కొన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానానికి ఆయనను ఎంపిక చేసే అవకాశమూ లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


